దేశ రియాల్టీ కింగ్ ఎవరో తెలుసా? టాప్ 100లో హైదరాబాదీలు ఆరుగురు

BY T20,

దేశ ఆర్థికాభివృద్ధి లో స్థిరాస్తి రంగం కీలకమెంతో. పాతికేళ్ల నాటితో పోలిస్తే ఈ రోజున పెరిగిన రియాల్టీ బూం తో వచ్చిన మార్పుల్ని మనం చూస్తున్నాం. స్వల్ప వ్యవధిలో పెద్ద ఎత్తున ఆస్తుల్ని పోగేయాలంటే స్థిరాస్థి వ్యాపారానికి మించింది లేదు. అలా అని జాగ్రత్తగా లెక్కలు వేసుకోకుండా దిగితే మాత్రం దారుణంగా దెబ్బ తినటం ఖాయం. దేశ రియాల్టీ రంగంలో మొనగాడు ఎవరు. అత్యంత సంపన్నుడు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానంతో పాటు.. దేశంలో టాప్ 100 రియాల్టీ ప్రముఖుల జాబితాను తయారు చేశారు. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో హైదరాబాద్ కు చెందిన ఆరుగురికి మాత్రమే చోటు దక్కింది.ఇక.. దేశంలోని స్థిరాస్తి రంగంలో అగ్రస్థానంలో నిలిచారు డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్. తాజాగా విడుదలైన గ్రోహే హురున్ ిండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్టు 2021లో అగ్రస్థానంలో నిలిచిన మ్యాక్రో టెక్ డెవలపర్స్ ప్రమోటర్లు మంగళ్ ప్రభాత్ లోథా ఫ్యామిలీ ఈసారి రెండో స్థానానికి జారుకుంటే.. రాజీవ్ సింగ్ అగ్రస్థానానికి చేరుకున్నారు. టాప్ 100 స్థిరాస్తి సంపన్నుల వివరాలతో కూడిన ఈ జాబితాలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

ఏడాది వ్యవధిలో రాజీవ్ సింగ్ సంపద 68 శాతం పెరిగి రూ.61220 కోట్లకు చేరుకోవటంతో ఆయన ర్యాంకింగ్ మెరుగు పడింది.  ఎంపీ లోధా కుటుంబ ఆస్తి 20 శాతం పెరిగి రూ.52.9వేల కోట్లకు పరిమితమైంది. మూడో స్థానంలో కే రహేజా గ్రూప్ నకు చెందిన చంద్రు రహేజా ఫ్యామిలీ రూ.26.2వేల కోట్లుగా తేల్చారు. నాలుగైదు స్థానాల్లో ఎంబసీ ప్రమోటర్ జితేంద్ర విర్వానీ రూ.23.6వేల కోట్లకు.. ఒబెరాయ్ రియాల్టీకి చెందిన వికాస్ ఒబెరాయ్ రూ.22.7వేల కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. ఇక.. టాప్ 100 జాబితాలో హైదరాబాద్ కు చెందిన ఆరుగురికి చోటు లభించింది.

టాప్ 100లో టాప్ 9 స్థానంలో జీఏఆర్ కార్పొరేషన్ కు చెందిన జి. అమరేందర్ రెడ్డి ఫ్యామిలీ రూ.15వేల కోట్లతో నిలిస్తే.. 11వ స్థానంలో మై హోమ్ కన్ స్ట్రక్షన్స్ కు చెందిన జూపల్లి రామేశ్వరరావు ఫ్యామిలీ రూ.9140 కోట్లుగా తేల్చారు. అపర్ణ కన్ స్ట్రక్షన్ కు చెందిన సి. వెంకటేశ్వర్ రెడ్డి రూ.5360 కోట్లతో 22వ స్థానంలో నిలిచారు.

23వ స్థానంలో అపర్ణ కన్ స్ట్రక్షన్ కు చెందిన ఎస్ సుబ్రమణ్యం రెడ్డి.. 31వ స్థానంలో అలియన్స్ గ్రూప్ అధినేత మనోజ్ నంబూరు రూ.3300 కోట్లు.. 78వ స్థానంలో తాజ్ జీవీకే కు చెందిన జీవీకే రెడ్డి ఫ్యామిలీ రూ.460 కోట్లతో నిలిచింది. గత ఏడాది డిసెంబరు 31 నాటికి వారి రియాల్టీ కంపెనీల్లోని వాటాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. దేశంలోని 14 నగరాలకు చెందిన 71 కంపెనీల యజమానులకు ర్యాంకింగ్ కేటాయించారు.

ఈ జాబితాలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన 37 మంది చోటు దక్కించుకోగా.. ఢిల్లీ నుంచి 23 మంది.. కర్ణాటక నుంచి 20 మంది ఉండగా.. తెలంగాణ మాత్రం సింగిల్ డిజిట్ ను దాటకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ కు చెందిన అర్బనైజ్ అలియన్స్ గ్రూప్ ఎండీ మనోజ్ నంబూరు రూ.3300 కోట్ల వ్యక్తిగత సంపదతో ఈ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకోవటం.. ఎంట్రీలోనే 31వ స్థానంలో నిలవటం విశేషంగా చెప్పాలి.

Scroll to Top