Acharya: ఇవేం గ్రాఫిక్స్ బాబోయ్.. సన్ ఆఫ్ ఇండియా కూడా బలాదూర్!

BY T20,

కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఆచార్య (Acharya)నెగిటివ్ టాక్ తెచ్చుకోవడానికి పలుకరణాలున్నాయి. కొరటాల శివ ఆచార్య మొదలుపెట్టి మూడేళ్లు దాటిపోయింది.

ఆయన గత చిత్రం భరత్ అనే నేను విడుదలైన నాలుగేళ్లకు ఆచార్య విడుదలైంది. ఈ మధ్యలో బోయపాటి శ్రీను అదే తరహా కథతో అఖండ మూవీ తీసి భారీ హిట్ కొట్టేశాడు. దాదాపు ఆచార్య-అఖండ స్టోరీ లైన్ ఒకటే. అక్కడ బాలకృష్ణ డబుల్ రోల్, ఇక్కడ చరణ్-చిరంజీవిల మల్టీస్టారర్.

తాను అనుకున్న ఆచార్యకు అచ్చుగుద్దినట్లున్న అఖండ (Akhanda)చిత్రాన్ని చూసి కొరటాల తడబడ్డాడనిపిస్తుంది. అఖండ చిత్రం గుర్తు రాకుండా ఆచార్యను మార్చేసి ఉంటాడు. దీంతో ఆయన అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించలేకపోయారు. మొత్తంగా ఆచార్య విషయంలో కొరటాల ప్లానింగ్ పూర్తిగా గతి తప్పింది. ఈ క్రమంలోనే షూటింగ్ కూడా పూర్తయ్యాక కాజల్ పాత్రను తీసేయడం, రీషూట్స్ జరపడం చేశారు.

ఇక హిట్ సినిమాకు అనుకోకుండానే అనేక అంశాలు కలిసొస్తాయి. ప్లాప్ సినిమాకు అనుకూల అంశాలు కూడా ప్రతికూలంగా మారతాయి. ప్రయోగాలు బెడిసి కొడతాయి. ఆచార్య మూవీలో కొరటాల చేసిన ఓ ప్రయోగం నవ్వులపాలైంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చిరంజీవిని యంగ్ గా చూపించడం కోసం విఎఫ్ఎక్స్ వాడారు. చిరంజీవి (Chiranjeevi)80ల నాటి లుక్ తలపించేలా ఆయన్ని యువకుడిగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే చాలా నాసిరకంగా, అసహజంగా ఉన్న ఈ ప్రయోగం ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది.

దీంతో మోహన్ బాబు అట్టర్ ప్లాప్ మూవీ సన్ ఆఫ్ ఇండియా (Son of India)చిత్రంలోని విఎఫ్ఎక్స్ వర్క్ తో పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు. ఆచార్య గ్రాఫిక్స్ సన్ ఆఫ్ ఇండియా గ్రాఫిక్స్ ని మించిపోయాయంటూ మీమ్స్ చేస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా మూవీలో ఓ సాంగ్ కోసం కోట్లు ఖర్చుబెట్టామని మోహన్ బాబు ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. తీరా సినిమాలో ఆ సాంగ్ చాలా నాసిరకమైన గ్రాఫిక్ వర్క్ తో కూడుకొని ఉంది. ఈ క్రమంలో ఆచార్యను సన్ ఆఫ్ ఇండియా తో పోల్చుతూ విమర్శిస్తున్నారు. నిజానికి ఈ తరహా ప్రయోగం సూర్య ఓ పదేళ్ల క్రితమే చేశాడు. 2009లో విడుదలైన ఘటికుడు మూవీలో చిన్నప్పటి పాత్ర అచ్చు సూర్యలా కనిపించడానికి ఫేస్ విఎఫ్ఎక్స్ తో డిజైన్ చేయడం జరిగింది.

Scroll to Top