మణుగూరు భావన.. యూట్యూబ్‌ పాఠాలతోనే అమెజాన్‌లో రూ.40 లక్షల ప్యాకేజీతో జాబ్‌

BY T20,

- మాది మల్టీ నేషనల్‌ కంపెనీ. మా కంపెనీలో ఉద్యోగం చేయాలంటే బిటెక్‌ కంపల్సరీ. కనీసం డిగ్రీలో కంప్యూటర్‌ కోర్సయినా చేసుండాలి. నీ దగ్గర అవి లేవు. సారీ, మా కంపెనీలో రాత పరీక్షకు కూడా మిమ్మల్ని అనుమతించలేం.
- మీ స్కిల్స్‌ మా కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా లేవు. కనీసం ట్రైనీగా కూడా మీకు ఉద్యోగం ఇవ్వలేం.

మొదటి రెండు ఇంటర్యూల్లో ఎదురైన పరాభావాలతో ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. భవిష్యత్తుపై బెంగ మొదలవుతుంది. బిటెక్‌ చేయకపోవడం నేరమా? రూరల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటే తప్పా ? ఇంగ్లీష్‌ రాకపోతే ఫ్యూచర్‌ ఉండదా అనే సందేహాలు చుట్టు ముడతాయి. అలా చుట్టు ముట్టిన అనుమానాలు పటాపంచలు చేస్తూ మూడో ప్రయత్నంలో అమెజాన్‌లో జాబ్‌ కొట్టింది భావన. అది కూడా లండన్‌ బేస్డ్‌గా రూ.40 లక్షల వార్షిక వేతనంతో. ఎక్కడో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు మండలం ఏడూళ్ల బయ్యారం వంటి మారుమూల ఏజెన్సీ నుంచి మొదలైన ఆమె ప్రయాణం ఈ రోజు లండన్‌ వరకు చేరుకుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, వాటిని అధిగమించిన తీరుతెన్నులు మీ కోసం...

అవమానాలే ఆలంబనగా
బానాల భావనది భద్రాది కొత్తగూడెం జిల్లా మణుగురు మండలం ఏడూళ్ల బయ్యారం. నాన్న శేషిరెడ్డి , అమ్మ లలిత. ఆమెకొక అన్నయ్య. ఎకరం పొలమే ఆ కుటుంబానికి ఆధారం. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఆ ఫ్యామిలీ వెన్నంటే ఉండేవి. ఊళ్లో, ఫ్యామిలీ ఫంక‌్షన్స్‌లో ఆ ఫ్యామిలీకి ‘చిన్న చూపు’ అనేది కామన్‌. ఆ ఫీలింగ్‌ ఆమెని ఎంతగానో బాధించేంది. అందుకే ఆ చిన్నచూపుని రూపుమాపేంత పెద్దాఫీసరు అయిపోయి ఫ్యామిలీకి పేరు తేవాలని కలలు కనేది. 

అంత ఈజీకాదు
ఐదు వరకు తెలుగు మీడియంలో చదివాక. ఆరులో మణుగూరులో ఇంగ్లీష్‌ మీడియంలో చేరింది భావన. భాష ఇబ్బందులతో మొదట్లో అన్నింటా ఫెయిల్‌. దాంతో సిక్త్‌ క్లాస్‌ రెండు సార్లు చదవాల్సి వచ్చింది. పది వరకు అత్తెసరు మార్కులతో పాస్‌. ప్రతీ పరీక్షలో వస్తున్న మార్కులు వెనక్కి లాగుతున్నా పెద్దాఫీసరు కావాలనే కల మాత్రం ముందుకు నడిపించిందామెను. అలా ఇంటర్‌ కోసం ఖమ్మంకు చేరుకుంది.అక్కడ మొదటిసారి ఇంగ్లీష్‌తో కుస్తీ పట్టడం ఆగి దోస్తీ కుదిరింది.

కరోనా కష్టాలు
పెద్దాఫీసరు కావాలంటే సివిల్స్‌ రాయాలని తెలుసుకుని ఇంజనీరింగ్‌ వైపు కాకుండా డిగ్రీని ఎంచుకుంది భావన. అలా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఫస్టియర్‌ పరీక్షలకు రెడీ అవుతుండగా కరోనా వచ్చి పడింది. లాక్‌డౌన్‌తో ఎక్కడి వాళ్లక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఓ వైపు ముందుకు సాగని చదువు మరోవైపు కుదురుగా ఉండనివ్వని పెద్దాఫీసరు కావాలనే కల. 

ప్లాన్‌ ఛేంజ్‌
డిగ్రీ తర్వాత సివిల్స్‌కి ప్రిపేర్‌ కావాలంటే రెండుమూడేళ్ల సమయం పడుతుంది. మరోవైపు కరోనాతో ఇబ్బందికరంగా మారిన కుటుంబ ఆర్థిక పరిస్థితులు భావనను పునరాలోచనలో పడేశాయి. భయాలు వెంటాడుతున్నా లక్ష్యాన్ని మార్చొద్దని నిర్ణయించుకుంది. అందుకే  సివిల్స్‌ క్రాక్‌ చేసే వరకు కుటుంబానికి ఆర్థిక భారం కావొద్దని నిర్ణయించుకుంది. అందుకే డిగ్రీ అవగానే ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. అలా చేయాలంటే తన స్కిల్స్‌ పెంచుకోవడం తప్పనిసరి అని గ్రహించింది. అందుకే లాక్‌డౌన్‌ టైంలో సినిమాలు, ఓటీటీలు, ఫ్యాషన్‌ వీడియోలకు కాకుండా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, స్పోకెన్‌ ఇంగ్లష్‌ వీడియోలు చూడటం మొదలెట్టింది.

అరువు తెచ్చుకుని
సీ, సీ ప్లస్‌ ప్లస్‌, పైతాన్‌, జావా లాంటి ప్రొగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ అన్ని యూట్యూల్‌లో చూసి నేర్చుకుంది. వీటిని ప్రాక్టీస్‌ చేసేందుకు ల్యాప్‌ట్యాప్‌ లేకపోతే పక్క వారి నుంచి అరువు తెచ్చుకుంది. అలా క్రమంగా డిగ్రీ సెకండియర్‌ పూర్తయ్యే టైంకి చాలా వరకు కంప్యూటర్‌ ప్రాగ్రామ్స్‌పై పట్టు సాధించింది.

ఇంగ్లీష్‌మయం
వృత్తిపరమైన నైపుణ్యం ఎంతున్నా ఇంగ్లీష్‌ భాషపై పట్టు లేకపోతే ప్రమాదమనే విషయం గుర్తించింది. అందుకే యూట్యూబ్‌ వీడియోస్‌తో కుస్తీ పట్టింది. అక్కడ నేర్చుకున్న విషయాలను బయట ప్రాక్టీస్‌ చేసింది. ఇంట్లో అమ్మతో, బయట ఫ్రెండ్స్‌తో ఫోన్‌ చాటింగుల్లో అంతటా ఇంగ్లీష్ ప్రాక్టీస్‌ పెంచింది. అలా డిగ్రీ ఫైనలియర్‌ వచ్చే సరికి ఇటు కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌, అంటు ఇంగ్లీష్‌పై కమాండ్‌ సాధించింది.

ఫైనలియర్‌లో ప్రయత్నాలు
డిగ్రీ ఫైనలియర్లో ఉండగానే వివిధ మల్టీ నేషనల్‌ కంపెనీలకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేది. రెండు పెద్ద కంపెనీలు స్కిల్స్‌ లేవంటూ ఇంగ్లీష్‌ రాదంటూ బిటెక్‌ చదవలేదంటూ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించాయి. 

పట్టువదలకుండా
అఖరికి అమెజాన్‌ సంస్థ సైతం తొలి రెండు ప్రయత్నాల్లో కనీసం రాత పరీక్షకు కూడా ఆమెను పిలవలేదు. కానీ పట్టు వదలకుండా ప్రయత్నించడంతో మూడో ప్రయత్నంలో రాత పరీక్షకు పిలుపొచ్చింది. అలా వచ్చిన పిలుపు వరుసగా ఐదు రౌంట్స్‌ వరకు కంటిన్యూ అయ్యింది. అన్ని రౌండ్స్‌ని కాన్ఫిడెన్స్‌తో పూర్తి చేసింది. 

నమ్మలేని నిజం
2022 ఏప్రిల్‌ 2న అమెజాన్‌ నుంచి మెయిల్‌ వచ్చింది. ఓపెన్‌ చేసి చూస్తే యువర్‌ సెలక్ట్‌ అంటూ అమెజాన్‌ ఆఫర్‌. అంతేకాదు వర్క్‌ స్టేషన్‌ లండన్‌, వార్షిక వేతనం 30,983 యూరోలు (ఇండియన్‌ కరెన్సీలో రూ. 39.50 లక్షలు). ఇది నిజామా కాదా అని తెలిసిన వాళ్లకు ఆ ఈ మెయిల్‌ పంపింది. ఇంతలో అమెజాన్‌ నుంచి కాల్‌ చేసి నిజమేనంటూ కన్‌ఫర్మ్‌ చేశారు.

సివిల్స్‌ లక్ష్యం అలాగే ఉంది- బానాల భావన
నేను ఎనిమిదో క్లాస్‌లో ఉన్నప్పుడు ఫుల్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో లైఫ్‌స్టోరీ యూబ్యూబ్‌లో చూశాను. చిన్నప్పుడు ఆడుకునేందుకు బాల్స్‌ లేక పేపర్లను ఫుల్‌బాల్‌లాగా ఉండలుగా చుట్టి ప్రాక్టీస్‌ చేసేవాడు క్రిస్టియానో. అతని తల్లిదండ్రులు ఇళ్లలో పని చేస్తూ క్రిస్టియానోని పెంచారు. ఎప్పుడైనా నాలో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ తగ్గితే క్రిస్టియానో స్టోరీ గుర్తుకు తెచ​‍్చుకుంటాను. ఇప్పుడు మంచి జాబ్‌ వచ్చినా.. సివిల్స్‌ రాయాలనే కల అలాగే ఉండిపోయింది. కచ్చితంగా సివిల్స్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతాను. సాధిస్తాను.

Scroll to Top