Bollywood: కమర్షియల్ కంటెంట్‌కు దూరమైన బాలీవుడ్.. అందుకే సౌత్ డామినేషన్!

BY T20,

ఊర మసాలా కమర్షియల్ కంటెంట్ తీసే దర్శకులు హిందీలో బొత్తిగా తగ్గిపోయారు. సల్మాన్ అక్షయ్ లు తప్ప అందరూ అర్బన్ డ్రామాల్లోనే కనిపిస్తున్నారు.

అందుకే మాస్ ప్రేక్షకుల ఆకలిని మన సౌత్ దర్శకులు తీస్తున్నారు. సినిమా డబ్బింగా రీమేకా అనేది పట్టించుకోకుండా అక్కడి ఆడియన్స్ థియేటర్లకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే సౌత్ డామినేషన్ నార్త్ లో క్లియర్ గా కనిపిస్తోంది.

దక్షిణాది సినిమాల్లో యాక్షన్‌, డ్రామా, కామెడీ.. ఈ మూడు బాగా ఉంటున్నాయి. ఇవే మాస్‌ ప్రేక్షకులకు బాగా చేరువచేస్తున్నాయని వలిమై టైమ్ లో బోనీకపూర్ చెప్పుకొచ్చారు. కొన్ని ఏళ్లుగా బాలీవుడ్‌లో ఎక్కువ శాతం మందికి చేరువయ్యే సినిమాలు రావడం లేదు. సల్మాన్‌ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఆమిర్‌ఖాన్‌ ల నుంచి రణ్ బీర్, రణ్ వీర్ లాంటి హీరోల సినిమాలు మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులకే పరిమతం అయ్యేలా ఉంటున్నాయి. రాజ్‌కుమార్‌ రావ్‌, ఆయుష్మాన్‌ ఖురానా లాంటి వారి పరిధి కొంత వరకే ఉంటుంది. అయినా ఎవరూ మాస్ నాడి పట్టుకునే కంటెంట్ కోసం ఆలోచించట్లేదు.

కానీ ఇప్పుడు అసలు సంగతి తెలుస్తోంది. సల్మాన్, షారుఖ్, హృతిక్ లాంటి హీరోలు పరిధి దాటి ఆలోచిస్తున్నారు. టైగర్ 3 మళ్లీ సల్మాన్ ఖాన్ కు మునుపటి క్రేజ్ తీసుకురావడం ఖాయమని బాలీవుడ్ జనాలు చెప్తున్నారు. పఠాన్ తో షారుఖ్.. ఫైటర్ గా హృతిక్ రోషన్ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం కనిపిస్తోంది. టైగర్3, పఠాన్, ఫైటర్ సినిమాలపై సల్మాన్, షారుఖ్, హృతిక్ కూడా బాగానే నమ్మకంతో ఉన్నారు. లేట్ అయినా సరే మాస్ ఎలివేషన్స్ యాడ్ చేసి 2023లో వస్తామంటున్నారు.

మాస్ సినిమాలు చేయడం వేరు.. మాస్ హీరోగా ఎలివేట్ అవడం వేరు. కొందరు హీరోల అంచనాలు ఇక్కడే తప్పుతున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లేదంటే డార్క్ మోడ్ సెట్ చేసి, వేషం మార్చేసి.. నాలుగైదు పలుచటి డైలాగులు చెప్పేస్తే సరిపోదు. యాక్షన్ లో లెవెల్ ఉండాలి.. డైలాగ్ లో పవర్ఫుల్ పంచ్ పడాలి.. ఎలివేషన్స్ గూజ్ బంప్స్ తెప్పించాలి. ఆ సౌండ్ కి ఊపురావాలి.. ఆ పాటకి ఊగిపోవాలి.. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీని ఏలే మాస్ మంత్రం. దీన్ని ఫాలో అయినవారు సక్సెస్ టేస్ట్ చేస్తారు.. లేదంటే మరోసారి మాస్ వంట వండుతారు. అయితే ఇండస్ట్రీలో కండీషన్స్ అప్లై.. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.

Scroll to Top