అక్బరుద్దీన్ విద్వేష వ్యాఖ్యల కేసులో కోర్టు కీలక తీర్పు

BY T20,

ఎంఐఎం ముఖ్య నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి కోర్టు కేసులో ఊరట లబించింది. విద్వేష వ్యాఖ్యల కేసులో కోర్టు ఆయనను నిర్ధోషిగా ప్రకటించింది. ఓవైసీపై దాఖలైన కేసులను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. 2012 డిసెంబర్ లో హిందువులను ఉద్దేశించి అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు కేసు నమోదైంది. నిజామాబాద్ నిర్మల్ లో చేసిన వ్యాఖ్యలపై ఒక వర్గం తీవ్రంగా స్పందించింది. దీంతో అక్బర్ పై కేసులు నమోదయ్యాయి. అక్బరుద్దీన్ పై రెండు కేసులను నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం కొట్టివేసింది.

అక్బరుద్దీన్ విద్వేష పూరిత ప్రసంగాలు చేసినట్లు పోలీసులు ఆధారాలు చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది.  ఈ కేసుల్లో నిర్ధోషిగా తేలినంత మాత్రాన సంబురాలు చేసుకోరాదని.. భవిష్యత్తులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని అక్బరుద్దీన్ ను కోర్టు ఆదేశించింది. దేశ సార్వభౌమత్వం దృష్ట్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ఓవైసీని న్యాయస్థానం మందలించింది.

2012 డిసెంబర్ 8న నిజామాబాద్ లో.. అదే నెల 22న నిర్మల్ లో హిందువులను ఉద్దేశించి విద్వేషపూరిత ప్రసంగం చేశారని అక్బరుద్దీన్ పై కేసు నమోదైంది. దీనిపై 2013 జనవరి 2న నిర్మల్ నిజామాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

జనవరి 8న అక్బర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి నిర్మల్ కు తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు 40 రోజుల పాటు అక్బరుద్దీన్ జైల్లోనే ఉన్నారు. ఫిబ్రవరి 16న అక్బర్ బెయిల్ పై విడుదలయ్యారు.

అక్బరుద్దీన్ హేట్ స్పీచ్ పై ఎఫ్ఐఆర్ లో దేశద్రోహం కింద పలు సెక్షన్ల కేసులు నమోదయ్యాయి. అయితే కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో మాత్రం ఆ సెక్షన్లను తొలగించడం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. సాక్ష్యాధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారని.. అందుకే కేసు వీగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.

అటు ఆదిలాబాద్ లో హిందూ దేవతలపై అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టు సుధీర్ఘ విచారణ జరిపింది. ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ కేసులో 30 మంది సాక్ష్యులను విచారించింది.

అక్బరుద్దీన్ కేసులో తీర్పుతో పాతబస్తీలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సంబరాలకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు.

Scroll to Top