ఎలన్ మస్క్.. ట్విటర్.. కాసిన్ని అప్ డేట్స్

BY T20,

చేతిలో డబ్బులు ఉండాలే కానీ కొండ మీద కోతిని అయినా కిందకు దించేయొచ్చన్న మాటలో నిజమెంతన్న విషయాన్ని టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేతల్లో చేసి చూపించారు. అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం ట్విటర్ మీద మనసు పడిన ఆయన మాటల్ని విన్న దారిన పోయే దానయ్య.. అంతగా నచ్చినప్పుడు కొనేయొచ్చుగా? అని ప్రశ్నించటం.. దానికి బదులుగా.. కొనేద్దామంటూ చెప్పిన మాట నాలుగేళ్లకు నిజం కావటం.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ట్విటర్ ను కొనుగోలు విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

దాదాపు 3.36 లక్షల కోట్ల రూపాయిలు పెట్టి కొనుగోలు చేసిన ట్విటర్ ను ఎలాన్ మస్క్ ఏం చేయనున్నారు? మరో మూడు నుంచి ఆర్నెల్ల లోపు ముగిసే డీల్ అనంతరం ఏమేం జరగబోతున్నాయి? ఎలన్ సారథ్యంలో ట్విటర్ ప్రయాణం ఏ రీతిలో సాగనుంది? ట్విటర్ ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి? లాంటి బోలెడన్ని ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ట్విటర్ పిట్టను కొనే డీల్ ఓకే అయ్యిందన్న ఎలాన్ మస్క్ ప్రకటన అనంతరం చోటు చేసుకున్న టాప్ 5 పరిణామాల్ని చూస్తే..

ట్విటర్ ను బంధనాల నుంచి తప్పిస్తాడా?

ట్విటర్ ను ఒక్క లైన్ లో చెప్పేయాలంటే.. భావవ్యక్తీకరణ స్వేచ్ఛే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఇంతటి కీలకమైన లక్ష్యం వ్యాపారంగా ఉన్నప్పుడు ఎదురయ్యే ఇబ్బందులెన్నో. ట్విటర్ అందుకు మినహాయింపుకాదు. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఎన్నో ప్రయోగాలు చేసి.. ఎదురుదెబ్బలు తిన్న ట్విటర్.. తన మనుగడ కోసం ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే విధానానికి తెర తీసింది. దీంతో.. వివాదాస్పద ట్వీట్లు చేసే అకౌంట్లను రద్దు చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ ను సైతం టెర్మినేట్ చేయటం ట్విటర్ కు సాధ్యమైంది.
ట్విటర్ ను కొనుగోలు చేసిన ఎలాన్.. తన సారథ్యంలో ప్రకటనల మీద కంపెనీ ఆధారపడకుండా.. యూజర్ల సబ్ స్క్రిప్షన్ల  మీద ఆదాయాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. అప్పుడు ప్రకటనల ఆదాయం మీద ఆధారపడటం తగ్గుతుందన్నది ఆయన లెక్కగా చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రకటన కర్తల ఒత్తిడి ఉండదని.. కంటెంట్ మీద నియంత్రణకూడా తగ్గించొచ్చన్నది ఎలాన్ ఆలోచనగా చెబుతున్నారు.

ట్విటర్ కొనుగోలు వెనుక అసలు లెక్క ఇదేనా?

ఊరికే ఎవరూ ఏదీ చేయరు. అందునా.. లక్షల కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కంపెనీని ఉత్త పుణ్యానికి వదిలేయరు. ట్విటర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మాస్క్ కూడా అలాంటి ఏదో ఒక ప్రయోజనం కోసమే ట్విటర్ ను కొనుగోలు చేసి ఉంటారని భావిస్తున్నారు. కొందరి అంచనా ప్రకారం.. ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం తన ఇతర వ్యాపారాల్ని ప్రమోట్ చేసుకోవటానికి వినియోగించే వీలుందంటున్నారు. లక్షల కోట్లు పెట్టి కొనుక్కున్న తర్వాత ఆ మాత్రం వాడకుండా ఉంటారా?

ట్విటర్ కొనుగోలు అతడికి పెద్ద విషయమే కాదా?

రూ3.36 లక్షల కోట్లు పెట్టి ఒక కంపెనీ కొనేస్తున్న ఎలాన్ మస్క్ కు ఇదేమీ పెద్ద డీల్ కాదా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే.. అతని ఆస్తి ఏకంగా 270 బిలియన్ డాలర్లుగా చెబుతారు. ట్విటర్ డీల్ 44 బిలియన్ డాలర్లు. అంటే.. తన ఆస్తిలో కేవలం 17 శాతంతో ట్విటర్ ను కొనుగోలు చేస్తున్నారంటే. ఇక.. ఆయనకు చెందిన టెస్లా మార్కెట్ విలువే ఏకంగా లక్ష కోట్ల డాలర్లుగా చెబుతారు. ఇది దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలైన ఫోర్డ్.. జనరల్ మోటార్స్ రెండు కంపెనీల విలువ కంటే ఎక్కువ కావటం గమనార్హం. టెస్లా ఒక్క ఏడాది (గత ఆర్థిక సంవత్సరం)లో 14 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది.

కొనుగోలు సరే.. ఉద్యోగుల మాటేంటి?

ఎలాన్ మస్క్ ఆలోచనలు ఎలా ఉంటాయన్నది ఆయన కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు బాగా తెలుసంటారు. ఇంతకాలం ట్విటర్ లోని ఉద్యోగుల వర్కు కల్చర్.. ఎలాన్ చేతికి వెళ్లిన తర్వాత మారటం ఖాయమని చెప్పకతప్పదు. మరి.. అలాంటి వేళ ఆ సంస్థలో పని చేసే ఉద్యోగుల మాటేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ట్విటర్ ను ప్రైవేటు కంపెనీగా మార్చేస్తే ఉద్యోగాల్లో భారీ కోతలు ఖాయమన్న మాట ప్రధానంగా వినిపిస్తుంటే.. మరోవైపు కంపెనీ పని తీరు ఏ రీతిలో ఉంటుందన్నది తనకు సైతం నో ఐడియా అంటున్నారు సంస్థ సీఈవోగా వ్యవహరిస్తున్న పరాగ్ అగ్రవాల్. ప్రస్తుతానికి అయితే ఉద్యోగుల ప్యాకేజీలో మార్పులు ఉండవని.. ఇప్పటికే అమలవుతున్న ప్యాకేజీలో మరో ఏడాది పాటు కొనసాగవచ్చంటున్నారు.

2017లోనే కొనేద్దామన్న మాట

ఎలాన్ మస్క్ ఎలా ఉంటారు? ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారన్న దానికిపై ఆయనకున్న స్పష్టత అంతా ఇంతా కాదంటున్నారు. ఏదైనా వస్తువును చూసి ముచ్చట పడిన తర్వాత.. దాన్ని సొంతం చేసుకునే విషయంలో సవాలచ్చ ఆలోచిస్తాం. కానీ.. ఎలాన్ మాత్రం అలాంటి పని చేయడు. ఆయన మనసుకు ఏదైనా నచ్చితే కొనేద్దామని చాలా సింఫుల్ గా చెప్పేయటమే కాదు.. అందుకు తగ్గట్లే కొనుగోలు చేయటం ఆయనకే దక్కుతుంది. నోటి నుంచి కొందామన్న మాట రావటానికి ఎంత తక్కువ టైం తీసుకుంటారో.. ఒకసారి నోటి నుంచి మాట వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండటం కనిపిస్తుంటుంది.

2017లో డేవ్ స్మిత్ తో ఎలాన్ జరిపిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. అప్పట్లో ట్విటర్ అంటే తనకు చాలా ఇష్టమని ఎలాన్ పేర్కొంటే.. దానికి స్పందించిన డేవ్.. ‘‘అలాంటప్పుడు కొనుక్కోవచ్చుగా’’ అని బదులిచ్చాడు. దానికి ఎలాన్ స్పందిస్తూ.. ‘‘కొనేద్దాం.. రేటెంత?’’ అని ప్రశ్నించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఏమైనా.. ఎలాన్ చేతికి ట్విటర్ వచ్చిందంటే.. దారిన పోయే దానయ్య డేవ్ స్మిత్ కూడా అంతో ఇంతో కారణమని చెప్పక తప్పదు.

Scroll to Top