దేశంలో ముంబయి తర్వాత అధిక ధరలు హైదరాబాద్ లోనే

BY T20,

తాజా నివేదికలో పేర్కొన్న అంశాల్ని చూసినప్పుడు హైదరాబాదీయులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల వారికి నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి. గతంలో హైదరాబాద్ మహానగరంలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే ఆర్థిక క్రమశిక్షణ ఉంటే సరిపోయేది. ఎందుకంటే.. చిరుద్యోగి మొదలు సంపన్నుడి వరకు ఎవరికి తగ్గట్లుగా వారికి అవసరమైన ఇళ్ల నిర్మాణాలు సాగేవి. దీంతో.. అందరికి అందుబాటు ధరల్లో ఇంటి నిర్మాణం ఉండేది. గడిచిన కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. భూముల ధరలకు భారీగా రెక్కలు రావటంతో పరిస్థితి మొత్తం మారిపోయింది.

ఇప్పుడు హైదరాబాద్ లోని ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం చూస్తే.. దేశంలో అత్యధిక ధరలు పలికే ముంబయి ఇళ్ల తర్వాత రెండో స్తానం హైదరాబాద్ దే కావటం గమనార్హం. కరోనా తర్వాత చోటు చేసుకున్న మార్పులు.. పెరిగిన భూమి ధరలతో పాటు.. నిర్మాణ వ్యయం అంతకంతకూ ఎక్కువై పోతున్న వేళలో.. హైదరాబాద్ మార్కెట్ లో భారీ పెరుగుదల నమోదవుతోంది. ఈ ఏడాది మొదటి మూడు నెలలు (జనవరి - మార్చి) కాలంలో ఇళ్ల ధరలు ఏకంగా 9 శాతం పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

క్రెడాయ్ కొలియర్స్ లయసెస్ ఫొరాస్ నివేదిక ప్రకారం చూస్తే.. దేశంలోని ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి - మార్చి మూడు నెలల వ్యవధిలో సగటున 11 శాతం పెరిగినట్లుగా వెల్లడించారు. దీనికి కారణం డిమాండ్ పెరగటంతో పాటు.

నిర్మాణ రంగంలో వాడే ముడి సరుకుల ధరలు పెద్ద ఎత్తున పెరగటంతో ఇంటి ధరల్లో మార్పు చోటు చేసుకుంది. హైదరాబాద్ లో ఇప్పుడు చదరపు అడుగు రూ.9232గా ఉందని చెబుతున్నారు. దేశంలో ముంబయి తర్వాత ఇంత భారీ రేటు మరెక్కడా లేదంటున్నారు.

ఢిల్లీలో గడిచిన మూడు నెలల్లో పెరిగిన ధరలు 11 శాతం ఉన్నప్పటికి చదరపు అడుగు ధర హైదరాబాద్ తో పోలిస్తే తక్కువగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో ప్రస్తుతం చదరపు అడుగు రూ.7363గా ఉంది. అహ్మదాబాద్ లో రూ.5721కు చేరితే.. బెంగళూరు.. చెన్నై.. ముంబయిలలో మాత్రం ధర పెరుగుదలలో కేవలం ఒక్క శాతాన్ని మాత్రమే ఉండటం గమానర్హం. బెంగళూరులో చదరపు అడుగు రూ.7595గా ఉంటే చెన్నైలో చదరపు అడుగు రూ.7017గా ఉంది.

రానున్న ఆర్నెల్ల వ్యవధిలో మరో ఐదుశాతం నుంచి పది శాతం మధ్య ధరలు పెరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అంతకంతకూ సొంతింటి కలను నెరవేర్చుకోవటంతో పాటు.. వివిధ అవసరాలకు కోసం నిర్మాణాల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా చదివిన తర్వాత హైదరాబాద్ లో ధరలు అంతకంతకూ పెరిగిపోవటం సగటు జీవుల సొంతింటి కలను దూరం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

Scroll to Top