కేజిఎఫ్ 2లో కథని మలుపు తిప్పిన ఇనాయత్ ఖలీల్ ఎవరో తెలుసా??

BY T20,

ప్రస్తుతం దేశం మొత్తం కేజిఎఫ్ 2 గురించే మాట్లాడుకుంటున్నారు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి వసూళ్లు కురిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరిని, వారి నటనని అభినందిస్తున్నారు ప్రేక్షకులు. హీరో, హీరో తల్లి, అధీరా పాత్ర, రమైకా సేన్ పాత్ర ఇలా సినిమాలోని ముఖ్య పాత్రలందర్నీ నెటిజన్లు, ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఇందులో మన టాలీవుడ్ లో నటించేవాళ్ళు కూడా భాగమయ్యారు. ఈశ్వరిరావు, రావు రమేష్, ప్రకాష్ రాజ్.. ఇలా పలు పాత్రలు టాలీవుడ్ లో మనల్ని రెగ్యులర్ గా అలరించిన వాళ్లే ఉన్నారు.

అయితే వీరందరితో పాటు ఈ కథలో అందరూ మెచ్చుకునే పాత్ర ఇంకోటి ఉంది. అదే ఇనాయత్ ఖలీల్. కథని మలుపు తిప్పే ఈ పాత్రలో నటించింది మన టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నటుడి తండ్రి. అంతే కాక ఇది ఆయనకి మొదటి సినిమానే. ఈ విషయం ఆ యువ నటుడు చెప్పేంతవరకు ఎవ్వరికి తెలీదు. తెలుగు నటుడు ఆదర్శ్ బాలకృష్ణ పలు సినిమాల్లో హీరోగా, ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఆదర్శ్ తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం కేజిఎఫ్ 2లో ఇనాయత్ ఖలీల్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించారు. ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించకపోవడం విశేషం. ఆయన తొలిసారి 65 ఏళ్ళ వయసులో ఇనాయత్ ఖలీల్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

ఈ విషయంపై నటుడు ఆదర్శ్ బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇనాయత్ ఖలీల్ పాత్రలో ఉన్న తన తండ్రి ఫోటోలని షేర్ చేసి.. ”కేజీఎఫ్ 2 ప్రపంచంలో మా నాన్న ‘ఇనాయత్ ఖలీల్’గా ఓ భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. 65 ఏళ్ల వయసులో ఆయన కెరీర్ ని ప్రారంభించారు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ నీల్ కే చెందుతుంది” అని పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలుసుకొని ప్రేక్షకులు, నెటిజన్లు ఆదర్శ్ వాళ్ళ తండ్రిని ఈ ఏజ్ లో కెరీర్ మొదలు పెట్టడమే కాక మొదటి సినిమాలోనే అదరగొట్టేసారు అంటూ అభినందిస్తున్నారు.

Scroll to Top