పాపకు ప్రాణమున్నా పోయిందన్నారు.. చివరి నిమిషంలో ట్విస్ట్‌

BY T20,

ఐదు రోజుల శిశువు. అనారోగ్యంతో ఆస్పత్రిలోనే ఉంది. కాపాడుకోవడానికి రూ.లక్ష కుమ్మరించారు తల్లిదండ్రులు. అయినా 'పాప ప్రాణం పోయింది..

తీసుకెళ్లండి' అన్నారు డాక్టర్లు. దీంతో ఆశలొదులుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ప్రేమ ఆ పసిగుడ్డు గుండెను కరిగించిందేమో.. శ్మశానంలో ఉండగా కదలికలొచ్చాయి. ప్రాణంతోనే ఉందని గుర్తించి, ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వేణుకు సంగీతతో వివాహం జరిగింది. ప్రసవానికి సంగీత తల్లి ఊరైన కోరుట్లకు వెళ్లింది. అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏప్రిల్‌ 27న పాపకు జన్మనిచ్చింది. పాప ఉమ్మ నీరు తాగిందని, ఆరోగ్య సమస్యలున్నాయని అక్కడే చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో... కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

రూ. లక్ష వరకు ఫీజు వేసిన ఆస్పత్రి, పాప బతికే పరిస్థితి లేదని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించింది. పాపలో చలనం లేకపోవడంతో చనిపోయిందని భావించి శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ పాప కదలడం గుర్తించిన తల్లిదండ్రులు.. వెంటనే జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పడంతో సంగీత-వేణు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Scroll to Top