BY T20,
పాకిస్థాన్‌లో మరోసారి చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకొని మంగళవారం దాడి జరిగింది. ఈ ఘటనలో బుర్ఖా ధరించిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. బలూచిస్థాన్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ.. ఆ మహిళ ఈ దాడికి పాల్పడింది. ఈ సమయంలో మృతురాలి గురించిన విషయాలు తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎంఫిల్ చదివిన ఆమెకు.. ఇద్దరు పసిబిడ్డలున్నారు. ఆమె విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చినట్లు వార్త సంస్థలు వెల్లడించాయి.
మంగళవారం కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన మృతురాలి పేరు షారీ బలోచ్(30). ఆమె జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఎంఫిల్ పట్టా పొందింది. టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త డెంటిస్ట్. తండ్రి ఒక లెక్చరర్. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరికి ఎనిమిదేళ్లు. ఇంకొరికి ఐదేళ్లు. ఆ కుటుంబానికి ఉగ్రవాద చరిత్ర లేదు. ఇలాంటి ఈమె రెండేళ్ల క్రితం బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్‌లోని ఆత్మాహుతి దళంలో చేరింది. తన చిన్న పిల్లల కారణంగా ఈ దళం నుంచి బయటకు వెళ్లే అవకాశం వచ్చినప్పటికీ.. ఆమె ముందుకెళ్లేందుకే నిర్ణయించుకుంది.
‘ప్రస్తుత మిషన్‌ను షారీ బలోచ్ విజయంతంగా నిర్వహించింది. చైనా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విస్తరణకు చిహ్నం అయిన కన్ఫూసియస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, సిబ్బందిని లక్ష్యం చేసుకోవడానికి కారణం.. బలూచిస్థాన్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా ఉనికిని సహించబోమని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేందుకే. బలూచ్ వనరులను కొల్లగొట్టడం, బలూచ్ ప్రజలపై మారణహోమం నిర్వహిస్తోన్న పాకిస్థాన్ ఆర్మీకి సహకరించడం మానుకోవాలని చైనాను చాలాసార్లు హెచ్చరించాం. కానీ చైనా మా మాట పెడచెవినపెడుతోంది. ఇప్పటికైనా తన దోపిడీ ప్రాజెక్టులను ఆపకపోతే.. భవిష్యత్తులో జరిగే దాడులు ఇంకా తీవ్రంగా ఉండనున్నాయి’ అని బీఎల్ఏ హెచ్చరించింది.
ఈ దాడి అనంతరం షారీ భర్తగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి ట్విటర్లో స్పందించారు. ‘షారీ.. నువ్వు మా జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగుతావు’ అంటూ ఆమె, పిల్లలతో ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం వారు ఎక్కడున్నారో తెలియదు. దీనిపై బాషిర్ అహ్మద్ అనే జర్నలిస్టు స్పందిస్తూ.. ‘ఆ కుటుంబానికి పాకిస్థాన్ సైన్యం నుంచి ఎలాంటి హాని జరగలేదు. కానీ ఆమె ఎంచుకున్న మార్గం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆమె నిర్ణయానికి కారణాలు ఏమైనా.. బలూచ్ సాయుధపోరాటంలో రక్తపాతంతో కూడిన అధ్యాయం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది’ అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. బలూచిస్థాన్, దాని పరిసర ప్రాంతాలు చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌కు చాలా కీలకం. కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాంతో చైనీయులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ ప్రావిన్స్, కరాచీల్లో వేర్పాటు వాదులు దాడులకు పాల్పడ్డారు. తాజా ఘటనలో ముగ్గురు చైనా దేశీయులు మృతి చెందగా.. పాక్‌కు చెందిన వ్యాను డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దీనిని చైనా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రవాద సమస్యకు మూల కారణాన్ని తెలుసుకుని.. పరిష్కరించడానికి ప్రయత్నాలను ప్రారంభించాలని పాక్‌ను డిమాండ్ చేసింది.
Circulating CCTV footage shows the #Karachi University blast, a female suicide bomber standing near the gate of the University of Karachi, reportedly blew herself up when the bus carrying the Chinese arrived leaving all three dead and a Pakistani drive. pic.twitter.com/4h8j69tKFh
— AlAudhli العوذلي (@alaudhli) April 26, 2022