Vedaant Madhavan | సెలబ్రెటీ పిల్లల్లో మాధవన్ తనయుడి రూటే సపరేటు

BY T20,

Vedaant Madhavan | కాలం గొప్పదనం ఆటగాళ్లకే బాగా తెలుస్తుంది. కొన్నిసార్లు మిల్లీ సెకెన్లు, నానో సెకెన్లు కూడా జయాపజయాలను నిర్ణయిస్తాయి. పతకాలను తారుమారు చేస్తాయి.

అలాంటి అద్భుతమే డానిష్‌ స్విమ్మింగ్‌ ఓపెన్‌లో చోటుచేసుకుంది. రెప్పపాటులో.. అదీ పది మిల్లీ సెకన్ల తేడాతో బుల్లెట్‌లా దూసుకెళ్లి.. దేశానికి బంగారు పతకాన్ని సాధించాడు వేదాంత్‌ మాధవన్‌.

వ్యాపారవేత్తల బిడ్డలు, హీరోల తనయులు.. ఏ ఆర్థిక వివాదాల్లోనో, మాదక ద్రవ్యాల కేసుల్లోనో చిక్కుకుంటున్న ఉదంతాలు అనేకం. కానీ మాధవన్‌ తనయుడి రూటే వేరు. ఈ బంగారుకొండ బంగారు పతకమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. స్విమ్మింగ్‌ పరిభాషలో చెప్పాలంటే వేదాంత్‌ ఓ 'గోల్డెన్‌ ఫిష్‌’. నీటిలోకి దిగితే.. చేపకు కూడా అందడు. అంత వేగంగా ఈదేస్తాడు. నీటిలో సైతం ప్రత్యర్థులకు చెమటలు పట్టించగల నేర్పరి. అందుకే ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలు కొల్లగొట్టాడు. 2021లో జరిగిన జూనియర్‌ నేషన్‌వైడ్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో ఏకంగా ఏడు పతకాలు కైవసం చేసుకున్నాడు. పట్టుసడలని ఏకాగ్రతతో పతకాల పంట పండిస్తున్న కొడుకును చూస్తే.. ఏ తండ్రికైనా పుత్రోత్సాహమే! ఆ ఆనందాన్నే అనుభవిస్తున్నాడు మాధవన్‌.

నాదేం లేదు.. అంతా సరితదే!

'(నవ్వుతూ..) వేదాంత్‌ ఏ పతకం సాధించినా ఆ క్రెడిట్‌ మొత్తం నా భార్య సరితదే. మేమిద్దరం కలిసి చేసిన గొప్ప పని ఒక్కటే.. వేదాంత్‌కు ఖాళీ సమయం ఇవ్వకపోవడం. అలా అని స్వేచ్ఛగా తిరగనివ్వలేదని కాదు. చెడు అలవాట్లవైపు మళ్లకుండా బాల్యంలోనే ఓ లక్ష్యాన్ని సిద్ధం చేశాం. దానివైపే వాడు గురిపెట్టేలా శిక్షణ ఇచ్చాం. ఓ తండ్రిగా నా బాధ్యత అంతవరకే. ఓ తల్లిగా సరిత శ్రమ మాటల్లో వర్ణించలేనిది. తెల్లవారుజామున నాలుగింటికే కొడుకుతో పాటు లేచేది. స్విమ్మింగ్‌ తీరును గమనిస్తూ తనకు తెలిసిన మెలకువలు చెప్పేది. తర్వాత శిక్షణకు తీసుకెళ్లి, తీసుకురావడం.. జిమ్మింగ్‌, చదువు, హాబీస్‌.. బాధ్యతలన్నీ తనే చూసుకునేది. నేను నా బిడ్డ విజయాలను మాత్రం ఎంజాయ్‌ చేస్తూ ఉంటా' అంటూ తండ్రిగా తన మమకారాన్ని బయటపెట్టారు మాధవన్‌.

ఒలింపిక్స్‌పై గురి!

డెన్మార్క్‌లో డానిష్‌ ఓపెన్‌ -22లో డబుల్‌ ధమాకా విజయంతో బంగారు, రజత పతకాలు సాధించిన 16 ఏండ్ల వేదాంత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే సంకల్పంతో
ఉన్నాడు. 'గత ఒలింపిక్స్‌లో గోల్డ్‌ సాధించిన యూఎస్‌ ఆటగాడు రాబర్ట్‌ ఫింకీ టైమింగ్‌ 7:41.87 నిమిషాలు. ఇప్పుడు వేదాంత్‌కు కేవలం 16 ఏండ్లే. ప్రతి ఈవెంట్‌లోనూ తన వేగాన్ని మెరుగు చేసుకుంటున్నాడే తప్పించి, ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. డానిష్‌ ఓపెన్‌లో 8:17.28 నిమిషాల్లో గోల్డ్‌ కొట్టాడు. లక్ష్యం దిశగా మరింతగా శ్రమిస్తే.. ఈ ఫీట్‌ సాధించడం కూడా కష్టమైన పనేం కాదు. చిన్న వయసే కాబట్టి మరిన్ని ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశమూ ఉంది. అన్నట్టు, వేదాంత్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. తనకు మూగజీవాలంటే ప్రేమ. తొమ్మిదేండ్ల వయసులోనే అనేక పక్షులను రక్షించి పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ (పెటా) సంస్థ నుంచి 'కంపాసినేట్‌ కిడ్‌’ అవార్డు అందుకున్నాడు. 'ఈ పేరు, గుర్తింపు, మీడియా కథనాలు నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇదే స్థాయిలో ఇతర స్విమ్మర్ల గురించి కూడా కథనాలు రావాలి. నా కారణంగా మిగతా ప్రతిభావంతులు మరుగునపడిపోకూడదు' అంటాడు వేదాంత్‌. ఇంత నిజాయతీగా ఏ సెలబ్రిటీ తనయుడూ మాట్లాడిన దాఖలాలు లేవు. వేదాంత్‌.. నువ్వు సూపర్‌!

Scroll to Top