కూతురు కోసం 30 ఏళ్లుగా మగాడి వేషధారణలో తల్లి

BY T20,

ఈ ప్రపంచంలో బంధువులు ,మిత్రులందరి ప్రేమకంటే తల్లి ప్రేమ చాలాగొప్పది, ప్రధానమైనది కూడా. అందుకనే మనం జన్మించిన దేశాన్ని "మాతృదేశం"అని అంటాం.

ఎవరి జన్మ భూమి వారికి తల్లి వంటిది. తల్లియందున్నటు వంటి శక్తి మరెవరిలోనూ లేదు. తల్లి సంకల్పం వజ్రసంకల్పం. ఆమె సంకల్ప బలంచేతనే బిడ్డలు అభివృద్ధికి వస్తారు. తల్లి యొక్క సత్సంకల్పమెంతటి కష్టాలనైనా తీరుస్తుంది,తల్లి ఆశీర్వాదబలం ఎంతటి గొప్ప పనులనైనా సాధించే శక్తిని బిడ్డలకు ఇస్తుంది. ఏ మహనీయుని చరిత్రను మనం పరిశీలించినా, తల్లి ప్రేమచేతనే వారంతటి అభివృద్ధికి రాగలి గారని స్పష్టమవుతుంది. రామకృష్ణ పరమహంస, వివేకానం దుడు తల్లి యొక్క ఆశీర్వచన బలం చేతనే గొప్ప ఆధ్యాత్మిక శక్తిని సంపాదించారు. ఆధ్యాత్మికం తల్లికి ప్రథమ స్థానం ఇచ్చింది. వేదం..మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదే వోభవ, అతిథిదేవో భవ అని బోధించింది.

#ad1

తల్లి ప్రేమానురాగాలను బాగా పొందిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాదు... వైవాహిక జీవితంలో మరింత ఎక్కువ ఆనందాన్ని ఆస్వాదిస్తూ... మతిమరుపు సమస్యలు తక్కువగా ఉంటున్నట్టూ తేలడం విశేషం. మనం ఏ దేవతను పూజించినప్పటికీ, పూజించక పోయినప్పటికీ తల్లిని మాత్రం గౌరవించాలి. ఎవరిని గౌరవించినప్పటికీ గౌరవించక పోయినప్పటికీ తల్లిని గౌరవిస్తే అన్నీ సరిగా నెరవేరుతాయి. అయితే తాజాగా ఓ తల్లి తన బిడ్డల కోసం 30 ఏళ్ల పాటు మగాడిలా బతికింది. పురుషుడి వేషధారణలో పెయింటింగ్, టీ మాస్టార్, వంట మనిషిగా ఇలా​ ఎన్నో పనులను చేసింది. ఇన్నేళ్లకు ఈ నిజాన్ని బయటపెట్టింది.

తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్​ కి 30 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పుబు ఆమె వయస్సు 20 ఏళ్లు. పెళ్లయిన 15 రోజులకే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కడ్డునాయగన్​ పట్టికి మకాం మార్చింది. అక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతికింది. అయితే ఒంటరి మహిళ కావడం వల్ల ఎన్నో తప్పుడు చూపులు ఆమె వెంటపడి వేధించేవి. ఇంతలో కూతురికి పెచ్చియామ్మాల్ జన్మనిచ్చింది. అయితే కూతురిని సంరక్షించడం సహా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఓ అసాధారణ మార్గాన్ని ఎంచుకుంది పెచ్చియామ్మాల్. మగాడిలా వేషధారణ మార్చుకుంది. పేదరికం వల్ల పనికోసం చాలా ప్రాంతాలకు మారాల్సి వచ్చేది. ఎక్కడికెళ్లినా తాను మగాడిలా పరిచయం చేసుకునేది. ఈ క్రమంలోనే స్థానికంగా "అన్నాచ్చి" (పెద్దన్న)గా గుర్తింపు పొందింది. కొన్నాళ్లకు తూతుక్కుడి తిరిగొచ్చి క్రాప్​ హెయిర్​ కట్​, మగాడి దుస్తుల్లో పురుషుడిలానే జీవించసాగింది. టీ, పరోటా షాపుల్లో పనిచేసి ముత్తు మాస్టర్​ గా పేరుగాంచింది. ఇలా 30 ఏళ్ల పాటు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ టామ్​ బాయ్​లా బతికింది పెచ్చియామ్మాల్.

#ad2

పెచ్చియామ్మాల్ కూతురు షణ్ముక సుందరి మాట్లాడుతూ..."పనికి వెళ్లి వచ్చే క్రమంలో ఎదురైన వేధింపులతో అమ్మ మగాడిగా వేషధారణ మార్చింది. అమ్మా.. నాన్న అన్నీ తానై నాకు ఏ లోటూ లేకుండా చూసుకుంది. అమ్మ ఇలా చేసినందుకు గర్వంగా ఉంది. అయితే ధ్రువీకరణ పత్రాల్లో పురుషుడిలా ఉండటం వల్ల పింఛను తీసుకోవడంలో అమ్మ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అది పరిష్కారమై అమ్మకు పింఛను అందితే ఆమెకు ఎంతో సాయంగా ఉంటుంది" అని తెలిపింది.

పెచ్చియామ్మాల్ మాట్లాడుతూ..."పెళ్లి అయిన 15 రోజులకే భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత సొంతూరు నుంచి తూతుక్కుడి వచ్చాను. ఓ ఇల్లు అద్దె తీసుకొని పనిచేసుకునేదాన్ని. ఓ రోజు పని ముగించుకొని వచ్చేటప్పుడు ఓ లారీ అతను నాతో తప్పుగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి సహకారంతో ఆ పరిస్థితి నుంచి బయటపడగలిగాను. అతనే నాకో చొక్కా ఇచ్చి నన్ను ఇంటి దగ్గర దిగబెట్టాడు. మరునాడే 6 గంటలకు పని ముగించుకొని తిరుచానూరుకు వెళ్లి గుండు చేయించుకున్నా. చీర పక్కనపెట్టి ప్యాంటు, షర్టు​, రుద్రాక్ష ధరించా. కొన్నాళ్లకు ఆ డ్రైవర్ ముందు నుంచే వెళ్లినా అతడు గుర్తు పట్టలేదు. అప్పుడే అనిపించింది.. నాకు ఈ దుస్తులే సరైనవని"అని తెలిపింది.

Scroll to Top