గీతా ఆర్ట్స్ తో మరోసారి హీరోగా రానున్న తేజు
2019-11-30 17:11 IST

మెగాస్టార్ చిరంజీవి కి మేనల్లుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన హీరో సాయిధరమ్ తేజ్. ఇక ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో మంచి కథలను ఎంపిక చేసుకుంటూ విజయాలతో అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ‘పిల్లా నువ్వులేని జీవితం’ అంటూ వచ్చి మాస్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు. అల్లు అరవింద్ ఈ సినిమాతో తేజూను కొంతవరకూ నిలబెట్టగలిగారు.
అయితే, గత కొంతకాలంగా వరుస పరాజయాలతో వెనకబడ్డ సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ సినిమాతో మళ్లీ ఊపందుకున్నాడు. ప్రస్తుతం ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో తేజు హీరోగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు. వచ్చేనెల 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందు విడుదల కానుంది.
ఈ సినిమా తరువాత కూడా అల్లు అరవింద్ తో తేజూ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలిపారు.