RRR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సూపర్ సీన్.. ఎందుకు లేపేశారో..?

BY T20,

RRR: స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ భారీ అంచనాల మధ్య మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద జక్కన్న మరోసారి తన సత్తాను చాటాడు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పరుగులు తీశారు. అయితే ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు, చరణ్ అభిమానుల మధ్య ఓ విషయంపై తీవ్రంగా చర్చించుకున్నారు.

ఈ సినిమాలో చరణ్ పాత్రకు కొంతమేర ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారని.. తారక్ పాత్ర నిడివిని తగ్గించారని తారక్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. సోషల్ మీడియా వేదిక కూడా ఇదే చర్చ చాలా రోజులు సాగింది. అయితే ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో నటించిన ఓ నటుడు ఈ విషయంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నిజానికి ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించి ఓ పవర్‌ఫుల్ ఎలివేషన్ సీన్ ఉందని.. కానీ ఎడిటింగ్‌లో ఆ సీన్‌ను తీసేశారని ఆయన చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ నటుడు.. తారక్‌ను చరణ్ కొట్టిన తరువాత అతడిని జైలులో వేస్తారని.. అప్పుడు వచ్చే ఈ సూపర్ ఎలివేషన్ సీన్ కొమురం భీం పాత్రను మరింత హైలైట్ చేసేదని ఆయన అన్నారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు, అసలు ఇలాంటి సీన్‌ను ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఎందుకు తీసేశారు అంటూ జక్కన్నను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా నిడివి ఎక్కువ కావడంతోనే చాలా సీన్స్‌ను కట్ చేశారని ఆ నటుడు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఏదేమైనా తారక్ పాత్రకు సంబంధించిన ఓ సూపర్ సీన్‌ను జక్కన్న కట్ చేయడంతో తారక్ ఫ్యాన్స్ మరోసారి నిరాశకు లోనవుతున్నారు. ఇక ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో తారక్ పర్ఫార్మెన్స్‌కు అందరూ ఫిదా అయిన సంగతి తెలిసిందే.

Scroll to Top