BY T20,
ధర రూ.1000-2000
నూర్జహాన్ రకం ప్రత్యేకత
ఇండోర్: మామిడి పళ్లు అనగానే..
కేజీకి ఎన్ని తూగుతాయి? అని ఆలోచించడం సహజం. కానీ మధ్యప్రదేశ్లో సాగుచేసే 'భారీ' నూర్జహాన్ రకం పండు ఒక్కటే 4 కేజీలకు పైగా ఉంటుంది. జూన్లో దిగుబడికి సిద్ధమయ్యే ఈ పళ్లకు ధర కూడా ఎక్కువే.
ఈ రకం మొట్టమొదట సాగైంది అఫ్గానిస్థాన్లో కాగా మధ్యప్రదేశ్లోని అలీరాజ్పుర్ జిల్లా కొత్తివాడ ప్రాంతంలో కొద్దిమేర మాత్రమే ఈ రకం చెట్లున్నాయి. ఈ ఏడాది 3 చెట్లకు 250 వరకు మామిడి కాయలుండగా పక్వానికి వచ్చిన అనంతరం జూన్ 15 కల్లా విక్రయానికి పెడతామని రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు. గత ఏడాది ఒక్కో పండు సగటున 3.80 కేజీలు తూగగా ఈసారి మరింత పెద్దగా ఉండొచ్చని చెప్పారు. వాతావరణం అనుకూలించక చాలామేర పూత రాలిపోయినందున దిగుబడి పరిమితంగానే ఉంటుందన్నారు.
ఒక్కో పండు రూ. 1,000 నుంచి 2,000 మధ్య విక్రయించనున్నట్లు చెప్పారు. మామిడి ప్రియులు ముందుగా బుక్ చేసుకోవచ్చని, నెలన్నర తర్వాత విక్రయిస్తామని చెప్పారు. ఒక అడుగు పొడవుండే దీని టెంకే 150 నుంచి 200 గ్రాములు ఉంటుంది.