Sarkaru Vaari Paata : నేను విన్నాను, నేను ఉన్నాను అనే డైలాగ్ గురించి క్లారిటీ ఇచ్చిన పరశురాం

BY T20,

Sarkaru Vaari Paata : ఘట్టమనేని కుటుంబం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న చిత్రం సర్కారువారి పాట . ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్. కామెడీ నటుడు వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటించారు.

పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంది. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

కాగా- ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి కిందటే విడుదలైంది. దుమ్ము దులిపింది. నిమిషాల వ్యవధిలో లక్షలాది లైక్స్‌ను సొంతం చేసుకుందీ ట్రైలర్. మహేష్ బాబు స్కీన్ ప్రజెన్స్ డిఫరెంట్‌గా కనిపించింది. అభిమానులకు పోకిరి సినిమాను గుర్తు చేసింది. అందులో ఉన్నట్టే మేనరిజం, హెయిర్ స్టైల్, లుక్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. కాగా నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే డైలాగ్‌ను వాడటం పొలిటికల్ టచ్ ఇచ్చినట్టయింది.

సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఈ నినాదంతో ముందుకెళ్లారు. ప్రజల్లో జగన్ పట్ల నమ్మకాన్ని రగిల్చిన ఈ డైలాగ్ ఆయనకు అధికారం కట్టబెట్టింది. అయితే మహేష్ ఈ డైలాగ్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది అందరి అనుమానం. దీనిని జనాలు రెండు రకాలుగా తీసుకున్నారు. సీఎం జగన్ ని వ్యతిరేకించేవారు అది సెటైర్ అంటూ కథనాలు వల్లించారు.

సినిమా టికెట్స్ ధరల విషయంలో సీఎం జగన్ స్టార్ హీరోల ఆగ్రహానికి గురయ్యారని, ఆ క్రమంలో మహేష్ ఆయనపై సెటైర్ పేల్చారన్నారు. ఈవిషయంపై తాజాగా దర్శకుడు పరశురాం స్పందించారు.. సీఎం జగన్ ఫేమస్ నినాదం డైలాగ్ రూపంలో రాయడం వెనుక కారణం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ… "నాకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆయనకు హీరో వర్షిప్ ఉండేది. ఆయన నోటి నుంచి వచ్చిన `నేను ఉన్నాను.. నేను విన్నాను` అనే పొలిటికల్ డైలాగ్ నాకు చాలా ఇష్టం.

చాలా అర్థం ఉంది అందులో. ఎంత పెద్ద భావాన్ని.. ఇంత చిన్న ముక్కలో భలే చెప్పారు అనిపించింది. అలాంటి సందర్భం `సర్కారు వారి పాట`లో ఒకటి వచ్చింది. కథానాయిక కీర్తి సురేష్‌కి అలాంటి భరోసానే హీరో ఇవ్వాల్సివచ్చినప్పుడు ఈ డైలాగ్ పర్‌ఫెక్ట్ గా సరిపోతుందనిపించింది. స్క్రిప్టు రాస్తున్నప్పుడే ఈ డైలాగ్ ఉంది. మహేష్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎలాంటి డిస్కర్షన్ లేకుండా.. సెట్లో ఈ డైలాగ్ ఓకే అయిపోయింది" అని చెప్పుకొచ్చారు.

జగన్ అభిమానులు దీన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. ఎప్పటి నుండో వైఎస్ కుటుంబానికి కృష్ణ, మహేష్ సన్నిహితులు. ఈ క్రమంలో సీఎం జగన్ సుపరిపాలనను కొనియాడుతూ మహేష్ తన సినిమాలో జగన్ నినాదం తన నోటి నుండి డైలాగ్ రూపంలో పలికాడంటూ ప్రచారం చేశారు. ఐతే జగన్ పై ఇది సెటైరా? పొగడ్తా? అనేది సినిమా విడుదల తర్వాత తెలుస్తుందని ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు.

Scroll to Top