పవన్ కళ్యాణ్ లాంచ్ చేసిన ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్..!

BY T20,

ప్రముఖ యాంకర్ టీవీ వ్యాఖ్యాత మరియు హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ''జయమ్మ పంచాయితీ''. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించిన సుమ.. చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న పూర్తి స్థాయి సినిమా ఇది. విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ''జయమ్మ పంచాయితీ'' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ట్రైలర్ లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

'రా బావా.. మా ఊర్లో పంచాయితీ సూద్దువ్ గానీ.. ఏ ఊర్లో జరగని ఎరైటీ గొడవ ఒకటి జరుగుతోంది' అని చెప్పడంలో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఇద్దరు ఆడ పిల్లల తల్లి అయిన జయమ్మ (సుమ) గ్రామ పంచాయతీ ముందు ఓ సమస్యను లేవనెత్తగా.. అది ఆ గ్రామంలో బలమైన ప్రభావాన్ని చూపిందని అర్థం అవుతుంది.

జయమ్మ భర్త (దేవీ ప్రసాద్) అనారోగ్యంతో బాధ పడుతూ ఉండగా.. ఆమె తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. తన నిర్ణయానికి కట్టుబడి ఆ గ్రామంపై కూడా పోరాడేందుకు ఆమె సిద్ధమైంది. ఒక పూజారి మరియు అతని ప్రేయసి మధ్య జరిగే ప్రేమకథ.. ఒక టీనేజ్ అబ్బాయి - అమ్మాయి మధ్య స్నేహం వంటివి ఈ ట్రైలర్ లో చూపబడ్డాయి.

జయమ్మ తగవు ఏంటి? పంచాయితీకి ఎందుకు వెళ్ళింది? అది ఊరి సమస్యగా ఎలా మారింది? ఆమె ఆ గ్రామంపై పోరాటానికి ఎందుకు సిద్ధమైంది? అసలు ఈ ఈడ్లు గొడవ ఏంటి? అనేది తెలియాలంటే విలేజ్ డ్రామాగా తెరకెక్కిన 'జయమ్మ పంచాయతీ' సినిమా చూడాల్సిందే. ఇందులో జయమ్మగా సుమ తన అభినయంతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర యొక్క అసాధారణమైన క్యారక్టరైజేషన్ కు అందరూ ఈజీగా కనెక్ట్ అవుతారు.

'ఎవరి వల్ల సెడ్డావురా వీరన్నా అంటే.. నోటి వల్ల సెడ్డానురా కాటమరాజా అన్నాడంట' అంటూ సుమ తనదైన శైలిలో పలికే సంభాషణలు అలరిస్తున్నాయి. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. రవితేజ గిరిజాల దీనికి ఎడిటింగ్ వర్క్ చేయగా.. ధను అంధ్లూరి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

'జయమ్మ పంచాయితీ' సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ - టీజర్ మరియు పాటలు జనాల దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయబడిన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాని నిర్మించారు. 'జయమ్మ పంచాయితీ' చిత్రాన్ని 2022 మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Scroll to Top