ప్రధానమంత్రి కార్యాలయానికే.. కార్పెంటర్ ఝలక్

BY T20,

అది.. అమెరికా అధ్యక్షుడి నివాస భవనం కమ్ కార్యాలయం.. అక్కడి అధ్యక్షుడి కార్యాలయం.. అందులో ఓ పెద్ద టేబుల్. చూసేందుకు రాజసంగా దర్పం ఉట్టిపడుతూ ఉంటుందా టేబుల్. అక్కడినుంచే ఎన్నో నిర్ణయాత్మక ఆదేశాలు.. అందుకే దాని పేరు ''రిజల్యూట్ టేబుల్'' గా పెట్టారు. అమెరికాకు అధ్యక్షులు ఎందరు మారినా.. అదే టేబుల్.

అదే దర్పం. హుందాతనం. అక్కడినుంచే నిర్ణయాలు. అంతటి చరిత్ర ఉంది ఆ టేబుల్ కు . సరిగ్గా అలాంటిదే ఓ టేబుల్ (బల్ల) తయారు చేయించాలనుకుంది భారత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో). వైట్ హౌస్ లోలా శాశ్వతంగా పీఎంవోలో ఆ టేబుల్ ను శాశ్వతంగా ఉంచాలనేది ఆలోచన. మరి అంతటి ప్రాధాన్యం ఉన్న టేబుల్ ను సాదాసీదాగా రూపొందిస్తే ఎలా? అందుకనే ప్రఖ్యాత డిజైనర్ కు పని అప్పగించాలని భావించింది పీఎంవో.

మరొకరైతే ఎగిరి గంతేసేవారే..?
పీఎంవోలో అందులోనూ తరతరాలు నిలిచిపోయేలా ఓ టేబుల్ ను తయారు చేస్తే ఆ డిజైనర్ పేరు మార్మోగిపోయేది. ఇలాంటి అవకాశం కోసం ఎందరో డిజైనర్లు ఎదురుచూస్తుంటారు. పీఎంవో మాత్రం ఏరికోరి ఆ పనిని కునాల్ మర్చంట్‌కు అప్పగించాలనుకుంది. కానీ.. తీరా తీరని పరాభవం ఎదురైంది. మరొకరైతే.. తమ అభిప్రాయాలు రాజకీయ ఉద్దేశాలు వ్యక్తిత్వం ఎలా ఉన్నా.. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆఫర్ ను తలకెత్తుకునేవారే. కానీ అక్కడ ఉన్నది కునాల్ మర్చంట్. పీఎంవో ఆఫర్ ను తేలిగ్గా తీసిపారేశారు.

మీకు పని చేయను పో.. పీఎంవోలో శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక బల్ల (టేబుల్) తయారీ కోరుతూ ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వివేక్ కుమార్ ఇటీవల కునాల్‌కు లేఖ రాశారు. డిజైనింగ్ రంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రధాని మోదీ ఈ అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనిని తిరస్కరిస్తూ కునాల్ తీవ్రమైన అభ్యంతరాలతో లేఖ రాశారు. ప్రతిగా నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ జవాబిచ్చారు.

దేశంలో 20 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని ప్రస్తావించారు. పీఎంవో ప్రతిపాదనను ఒప్పుకొంటే.. దళితులు కుటుంబం మైనార్టీలు ఎల్జీబీటీక్యూ సమూహానికి ద్రోహం చేసినవాడిని అవుతానని పేర్కొన్నారు. 22 శాతం జనాభా ఉన్న ముస్లింలను సమాజం నుంచి మరింత వేరు చేసేలా మోదీ సర్కారు తీసుకునే నిర్ణయాలకు వేదికగా నిలిచే టేబుల్‌ను తయారు చేయబోనని స్పష్టం చేశారు. తనకుతాను గాంధేయ వాదినని చెప్పుకొంటూ.. అహింసా విధానం సత్యాగ్రహం పట్ల విధేయతను ప్రకటించారు.

అసలింతకూ ఏమిటి ఆయన సమస్య కునాల్ మర్చంట్ సమాధానాన్ని బట్టి చూస్తుంటే ఆయన ఉదారవాదిగా కనిపిస్తున్నారు. ఛాందస భావనలను వ్యతిరేకించే వారిగా ఉన్నారు. పీఎంవోకు రాసిన లేఖలో మర్చంట్ తనను తాను గాంధేయ వాదిగా చెప్పుకొన్నారు. దేశంలో అసమానతలను ప్రస్తావించారు. మైనారిటీల పట్లమోదీ సర్కారు ధోరణిని నిరసించారు.

దేశంలో పరిస్థితులు అంతా బాగుంటే.. తాను పీఎంవో ఇచ్చిన ఆఫర్ ను స్వీకరించేవాడినని.. తాను తయారు చేసిన బల్లకు ''స్వరాజ్ బల్ల''గా  పేరు పెట్టే వాడినని అన్నారు. అంతేకాక  లెస్బియన్ గే బై సెక్సువల్ ట్రాన్స్ జెండర్ల (ఎల్జీబీటీ) హక్కుల గురించి ప్రస్తావించారు.

Scroll to Top