సోనియాగాంధీ, ప్రియాంకతో గొడవపడ్డ రాహుల్‌?

BY T20,

శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న గొప్ప పార్టీని కేవలం ఒక వ్యక్తి చేతిలో పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు.

దీనికోసం తన తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకతో గొడవపడినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో ఎందరో సీనియర్ నేతలున్నారు.. మరెన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలున్నారు.. వీరందరినీ కాదని అధికారంలోకి తీసుకొస్తానంటూ ఒక వ్యక్తి ఇచ్చే ప్రజంటేషన్ నమ్మి పార్టీని ఆ వ్యక్తి చేతిలో ఎలా పడతారని ప్రశ్నించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో చేరడానికి పీకే ప్రయత్నాలు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన జనసురాజ్ పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేసి అక్టోబరు రెండోతేదీ నుంచి బీహార్ మొత్తం మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఏమేం చేయాలనేదానిపై ఆయన ఒక ప్రజంటేషన్ ఇచ్చారు.

పలుమార్లు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. దాంతోపాటు పార్టీలో సీనియర్ నేతగా ఒక పదవిని కూడా ఆశించారు. ఈ పదవివల్ల పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తాను అనుకున్నది చేయడానికి వీలవుతుందని చెప్పారు. అయితే దీనిపై పార్టీలోని కొందరు సీనియర్ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాహుల్‌గాంధీ వల్లే

అయితే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడానికి రాహుల్‌గాంధీయే కారణమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న పార్టీని ప్రశాంత్ కిషోర్‌లాంటి వ్యక్తి చేతిలో పెట్టడాన్ని రాహుల్ వ్యతిరేకించడంతోపాటు తన తల్లితో, సోదరితో విభేదించారు. సొంత ప్రయత్నాలమీద ఆధారపడదామని చెప్పారు.

పార్టీకన్నా దేశమే ముఖ్యం

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ ఇప్పటికే పీకే వ్యూహాలవల్ల సమాజంలో విద్వేషాలు రగులుగుతున్నాయని.. ఈ తరహా వ్యూహాలకు, సమాజంలో కులాలమధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రచారాలకు తాను పూర్తి వ్యతిరేకమని తమ నేత రాహుల్‌గాంధీ నిరూపించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి, పార్టీ నేతలకు దేశం ముఖ్యమనే విషయం మరోసారి నిరూపించినట్లైందన్నారు.

Scroll to Top