మళ్లీ కలవలేమని నాన్న చెప్పారు.. హత్తుకొని ఏడ్చేశా!

BY T20,

Ram Charan Chiru Emotional: తన తండ్రి, అగ్ర కథానాయకుడు చిరంజీవితో స్క్రీన్‌ పంచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని రామ్‌చరణ్‌ అన్నారు. వీళ్లిద్దరూ కలిసి నటించిన 'ఆచార్య' ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'ఆచార్య' షూట్‌కు సంబంధించి రామ్‌చరణ్‌ కొన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా షూట్‌ని తాను ఎంతగానో ఎంజాయ్‌ చేశానని అన్నారు.

ఆ క్షణం నాన్నను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నా..: "ఇంటి నిర్మాణ పనుల రీత్యా గత నాలుగేళ్లుగా నేను, నాన్నా దూరంగా ఉన్నాం. వీకెండ్స్‌లో అప్పుడప్పుడూ కలుస్తుంటాం. కానీ, 'ఆచార్య' సినిమా వల్ల మేమిద్దరం ఎక్కువ సమయం కలిసి ఉండే అవకాశం వచ్చింది. సుమారు 18 రోజులపాటు ఓ అటవీ ప్రాంతంలో మా ఇద్దరిపై సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ షెడ్యూల్‌ జరిగినన్ని రోజులు మేమిద్దరం ఒకే కాటేజీలో ఉన్నాం. రోజూ ఉదయాన్నే నిద్రలేవడం, ఇద్దరం కలిసి జిమ్‌లో వర్కౌట్లు చేయడం, ఒకే కారులో లొకేషన్‌కి వెళ్లడం, షూట్‌ పూర్తి కాగానే కలిసి కాటేజీకి రావడం, కలిసి భోజనం చేయడం.. ఇలా ఆ క్షణాలు మధురంగా గడిచిపోయాయి. నా జీవితంలో ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అప్పుడు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇదిలా ఉండగా, అదే సమయంలో ఓ రోజు నిద్రలేచిన వెంటనే నా వద్దకు వచ్చి.. "చరణ్‌.. వృత్తిపరమైన పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఎప్పటికో కానీ మనిద్దరం ఇలా కలుసుకునే అవకాశం రాదు. నీతో సమయాన్ని కేటాయించే అవకాశం మళ్లీ నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. 'ఆచార్య' వల్ల మనకు ఆ ఛాన్స్‌ దొరికింది. ప్రతి సెకన్‌ని కలిసి ఎంజాయ్‌ చేద్దాం" అని చెప్పారు. నాన్న మాటలతో నాకు కన్నీళ్లు ఆగలేదు. వెంటనే ఆయన్ని గట్టిగా హత్తుకుని.. 'తప్పకుండా... ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకుందాం' అని చెప్పా" అని చెర్రీ తెలిపారు.

ఆ మాట నేను ఒప్పుకోను..: "ఈ సినిమాలో నాన్న వింటేజ్‌ లుక్‌లో కనిపిస్తున్నారని మార్కెట్‌లో టాక్‌ వినిపిస్తోంది. అది నిజం. మ్యూజిక్‌ పరంగా వింటేజ్‌ ఫీల్‌ తీసుకురావడం కోసం మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకుందామని కొరటాల శివనే ప్రపోజల్ పెట్టారు. ఈ సినిమాలో ఆయన మ్యూజిక్‌ అదరగొట్టేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇక, నాన్న, నేనూ కలిసి చేసిన సాంగ్‌ చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ సాంగ్‌ షూట్‌ జరిగినప్పుడు అమ్మ, నానమ్మ సెట్‌లో ఉన్నారు. 'మా కొడుకు బాగా చేశారంటే, మా అబ్బాయి బాగా చేశాడు' అని సరదాగా చెప్పుకున్నారు. ఆరోజు మా అమ్మ కళ్లలో ఆనందాన్ని చూశా. ఇలాంటి ఎన్నో మధుర క్షణాలు నాకందించినందుకు దర్శకుడికి థ్యాంక్యూ. నిజం చెప్పాలంటే, నేను గొప్ప డ్యాన్సర్‌నని అందరూ చెప్పుకుంటున్నారు దాన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే.. చిరంజీవికి ఎవరూ సాటి కాదు. ఆయన డ్యాన్స్‌ చేస్తే శరీరంలోని ప్రతి భాగం ఆఖరికి వెంట్రుకలు కూడా అందులో భాగమై.. డ్యాన్స్‌ చేస్తాయి. 'ఆచార్య' చిత్రాన్ని నాన్నమ్మ, అమ్మ, నాన్నలతో కలిసి చూడటం ఒక వరంగా భావిస్తా" అని చరణ్‌ వివరించారు.

Scroll to Top