ఎన్టీఆర్ మనసు నొచ్చుకోకుండా సమాధానమిచ్చిన చరణ్..!

BY T20,

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ''ఆర్.ఆర్.ఆర్''. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

అయితే RRR సినిమా విడుదలైన దగ్గర నుంచీ ఇద్దరు హీరోల ప్రాధాన్యత విషయంలో ఫ్యాన్ వార్ మాత్రం ఆగడం లేదు. ఇందులో ఎన్టీఆర్ పాత్రను చరణ్ రోల్ డామినేట్ చేసిందని.. సీతారామరాజు పాత్రనే ఎక్కువ ఎలివేట్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. లేటెస్టుగా ముంబైలో జరిగిన సక్సెస్ పార్టీలో ఓ జర్నలిస్ట్ ఇదే అంశాన్ని లేవనెత్తడం వల్ల హీరోలిద్దరూ ఇబ్బందిపడే పరిస్థితి వచ్చింది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా వెయ్యి కోట్ల దిశగా పరుగులెడుతున్న నేపథ్యంలో హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. దీనికి రాజమౌళి - చరణ్ - తారక్ - డీవీవీ దానయ్య లతో పాటుగా అమీర్ ఖాన్ - జావేద్ అక్తర్ - కరణ్ జోహార్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా అటెండ్ అయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్ లో చరణ్ ను ఉద్దేశిస్తూ ఓ జర్నలిస్ట్.. 'ఈ సినిమాలో ప్రశంసలన్నీ మీరే అందుకుంటూ వెళ్తున్నారు కదా?' అంటూ ఎన్టీఆర్ కంటే ఎక్కువ మార్కులు కొట్టేశాడనే అర్థం వచ్చేలా ప్రశ్న వేసింది. నిజానికి ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఒకరిని పొగుడుతూ ఇలాంటి ప్రశ్న వేయడం అనేది వారికి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.

అందుకే ఇలాంటి విషయాన్ని విలేకరుల సమావేశంలో ఎవరూ చర్చించరు. కానీ అలాంటి ప్రశ్నలు అడగకూడదనే తెలివి లేని బాలీవుడ్ మీడియా తారక్ ముందు చరణ్ ను అడిగేసింది. అయితే రామ్ చరణ్ వెంటనే స్పందిస్తూ ఆ క్రెడిట్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు.

''లేదు మేడమ్. నేను దీన్ని నమ్మను. ఒక్క క్షణం కూడా నేను అలా అనుకోను. డామినేషన్ అన్న పదాన్ని నేను నమ్మను కూడా. అందులో నిజం లేదు. మేం ఇద్దరం బాగా చేశాం. తారక్ ఫెంటాస్టిక్ గా నటించాడు. అతనితో కలిసి పని చేయడం ఎంతో ఎంజాయ్ చేశా. ఈ సినిమా నుంచి నేను పొందిన అత్యుత్తమమైన విషయం.. తారక్తో నా ప్రయాణం. ఈ జర్నీని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఈ అవకాశం కల్పించిన రాజమౌళి సార్ కి ధన్యవాదాలు. తారక్ పై నా  ప్రేమ అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది'' అని రామ్ చరణ్ బదులిచ్చారు.

ఎన్టీఆర్ మనసు నొచ్చుకోకుండా ఈ ప్రశ్నకు రామ్ చరణ్ ఇచ్చిన సమాధానం అందరి మనసులను గెకుచుకుంది. ప్రస్తుతం చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి RRR సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంది. నటన పరంగా చూస్తే ఇద్దరిలో ఎవ్వరూ తక్కువ కాదు.

పులితో ఫైట్ - ఇంటర్వెల్ సీక్వెన్స్ - 'కొమురం భీముడో' సాంగ్ తో ఎన్టీఆర్ కూడా బాగా ఎలివేట్ అయ్యాడు. ఎమోషన్స్ పరంగా చూసుకుంటే తారక్ కే కొన్ని మార్కులు ఎక్కువే పడతాయి. కాకపోతే చరణ్ పాత్ర విస్తృతి మరియు క్లైమాక్స్ లో అల్లూరి గెటప్ లో చూపించి ఎలివేషన్ ఇవ్వడం వల్ల కొంచం ఎక్కువ హైలైట్ అయినట్లు అనిపించింది.

Scroll to Top