కందుకూరి కుర్రాడు ఆస్ట్రేలియాలో ఎమ్మెల్సీ

BY T20,

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కుర్రాడు ఆస్ట్రేలియా చట్టసభకు ఎన్నికయ్యాడు. ప్రవాస భారతీయులు పలువురు విదేశాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. విద్యార్థిగానే ఉంటూ చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆస్ట్రేలియాలో ఉండటం.. తన సేవా గుణంతో ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన కుర్రాడు. అదెలానంటే..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తూర్పుకమ్మపాలేనికి చెందిన దివి రామక్రిష్ణ.. ప్రత్యూష దంపతులు ఉద్యోగ నిమిత్తం పన్నెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఐటీ ఉద్యోగిగా వ్యవహరిస్తున్న అతను.. కుటుంబంతో సహా సిడ్నీలో స్థిరపడ్డారు. తమ పిల్లల్ని అక్కడే చదివిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా చట్టసభలకు యూత్ నుంచి కొందరిని ఎంపిక చేస్తుంటారు.

అయితే.. ఇలాంటి వారు వారు చేసే కమ్యునిటీ వర్కు (సామాజిక సేవ) ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రామక్రిష్ణ పెద్ద కుమారుడు 15 ఏళ్ల తనూజ్ చౌదరి ప్రస్తుతం అక్కడి కాలేజ్ లో ప్లస్ వన్ (ఇంటర్ మొదటి సంవత్సరం) చదువుతున్నాడు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. సమాజ సేవలో భాగస్వామ్యం అయ్యే వారు చట్టసభకు ఎంపిక కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

దీంతో.. అతను అప్లై చేయటం.. అతని అర్హతల్ని చెక్ చేసిన తర్వాత.. అన్ని అర్హతులు ఉన్నట్లుగా గుర్తించిన ఆస్ట్రేలియా చట్టసభకు మనం ఇక్కడ పిలుచుకునే తరహాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లుగా రామక్రిష్ణ వెల్లడించారు. ప్రస్తుతం తన కుమారుడు అక్కడి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నట్లుగా పేర్కొన్నారు.

మన దగ్గర ఎమ్మెల్సీ అన్నంతనే..అయితే డబ్బులిచ్చి అధికార పార్టీ దగ్గర పదవి కొనేయటం.. లేదంటే పార్టీకి.. అధినేతకు సన్నిహితుడిగా ఉండే వారికి.. వీర విధేయులకు.. కులాల సమీకరణలో భాగంగా పదవులు ఇవ్వటటమే తప్పించి.. సేవా కార్యక్రమాల్ని చేపట్టి.. అందరి మనసుల్ని గెలుచుకునే విధానమే మన దగ్గర లేదు. అలాంటప్పుడు విధానాలు మారటం సాధ్యమంటారా? ఏమైనా కందుకూరు కుర్రాడు విదేశీ గడ్డ మీద తన సత్తా చాటారంటే అంతకంటే కావాల్సిందేముంది?

Scroll to Top