‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!

BY T20,

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ నటించిన 'RRR' చిత్రానికి ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.

జాతీయస్థాయిలో ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్ని సీన్లు గ్రాఫిక్స్ అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఈ సీన్స్ రూపొందించే బాధ్యతలను రాజమౌళి, సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ మొత్తం 18 VFX సంస్థలకు అప్పగించారు. ఈ సినిమాలో మొత్తం 2,800 VFX షాట్స్ ఉన్నాయి.

రాజమౌళి సినిమా తీస్తున్నారంటే.. తప్పకుండా అది ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. 'ఆర్ఆర్ఆర్' మూవీ కూడా అంతే. అందులో రాజమౌళి అల్లిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. ముఖ్యంగా ఎన్టీఆర్-పులి సన్నివేశాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే, రామ్ చరణ్‌.. రాహుల్ రామకృష్ణను తాళ్లతో బందించే సీన్‌లో కనిపించే పాము కూడా గ్రాఫిక్స్ అంటే నమ్మగలరా? అయితే, మీరు తప్పకుండా VFXతో గ్రాఫిక్స్ యాడ్ చేయడానికి ముందు సీన్ చూడాల్సిందే. అలాగే, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో రామ్ చరణ్ గాల్లోకి ఎగురుతూ పులిని నిప్పుల కక్కుతున్న కాగడతో కొట్టే సీన్ కూడా చాలా రియల్‌గా ఉంటుంది. అయితే, రియల్‌గా చిత్రీకరించిన సీన్ చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా సీన్లలో తాము గాల్లో పిడిగుద్దులు కురిపించాల్సి వచ్చిందని, ఆ సీన్స్ చేసి చేసి చేతులు కూడా నెప్పి పుట్టాయని చెప్పారు. ఎందుకంటే.. వారు నటించిన సీన్స్‌లో ప్రత్యర్థి కనిపించడు. కానీ, అక్కడ వ్యక్తి లేదా జంతువు ఉన్నట్లు ఊహించుకుని గాల్లోనే ఫైట్ చేస్తుండాలి. ఆ తర్వాత ఆ సన్నివేశానికి తగినట్లుగా VFX సన్నివేశాలను రూపొందిస్తారు. అవి సరిగ్గా కుదరకపోతే రాజమౌళి రీ-షూట్ కూడా చేస్తారు. ఆ సీన్ పక్కాగా కనిపించిన తర్వాతే ఆయన ఓకే చేస్తారు. RRRలోని కొన్ని సన్నివేశాలకు అల్జాహ్రా స్టూడియో VFX సీన్స్ సమకూర్చింది. ఈ సందర్భంగా వాటిలోని కొన్ని సీన్స్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. గ్రాఫిక్స్‌కు ముందు, ఆ తర్వాత ఆ సీన్స్ ఎలా ఉన్నాయో చూసేయండి మరి.

Scroll to Top