ఇక మూడో ప్రపంచ యుద్ధమే.. రష్యా మీడియా సంచలనం

BY T20,

ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా రెండు నెలలు అవుతున్నా ఇంకా ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోలేకపోతోంది. ఉక్రెయిన్ కు అండగా అమెరికా యూరప్ లు నిలవడంతో ఈ యుద్ధం జాప్యమవుతోంది. భారీగా ఉక్రెయిన్ రష్యాసైనికులు చనిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ భీకర యుద్ధం వేళ రష్యా అధికారిక మీడియా సంచలన వ్యాఖ్యలు చేసింది. మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైందని ప్రకటించింది. రష్యా యుద్ధ నౌక మొస్క్వా మునిగిపోయిన తర్వాత ఈ యుద్ధం ఆరంభమైందని వ్యాఖ్యానించింది. నౌక మునకతో రష్యా ప్రధాన ఆలోచన పక్కదారి పట్టిందని హెచ్చరించింది.

కాగా యుద్ధ నౌక అగ్ని ప్రమాదం కారణంగా మునిగిపోయిందని రష్యా చెబుతుండగా.. తామే కూల్చివేశామని ఉక్రెయిన్ ప్రకటించుకుంది. రష్యా బ్లాక్ సీ ప్లీట్ కు చెందిన యుద్ధ నౌకను ‘నెఫ్ట్యూన్’ క్షిపణితో కూల్చివేశామని ఉక్రెయిన్ ఇదివరకూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా మీడియా ‘ఇక మూడో ప్రపంచ యుద్ధమేనని’ ప్రకటించడం సంచలనమైంది.

నౌక మునక పరిస్థితులను మూడో ప్రపంచయుద్ధంగా పిలవవచ్చని .. ఇది ఖచ్చితంగా జరుగుతుందని రష్యా తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం నాటో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో రష్యా పోరాడుతున్నట్టే భావించాలని.. ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉందని తెలిపింది.

యుద్ధ నౌక మొస్క్వా మునకను రష్యా గడ్డపై జరిగిన దాడిగా రష్యన్ మీడియా అభివర్ణించారు. టీవీ వ్యాఖ్యతలు కూడా ఇదే తరహా మాట్లాడారు. ఉక్రెయిన్ పై దాడులు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. బాంబుల దాడుల ఉధృతమవుతుండడంతోపాటు చర్చలు నిలిపివేసేందుకు అవకాశాలున్నాయని అన్నారు. చర్చలు నిలిపివేయడం కూడా ఉక్రెయిన్ పై బాంబు వేయడంగానే వారు అభివర్ణించారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో నష్టం భారీగానే ఉంటోంది. ఉక్రెయిన్ మొత్తం కకావికలం అయిపోయింది. దీంతో పలు నగరాలు దెబ్బతిన్నాయి. కోలుకోలేని విధంగా మారాయి. బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. రష్యా సేనల ధాటికి నివ్వెరపోతున్నాయి. యుద్ధ కాంక్షతో రష్యా చేస్తున్న దమనకాండతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలో రష్యా తీసుకొచ్చిన యుద్ధ నౌక దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నౌకలో భారీ ఆయుధ సామగ్రి ఉన్నట్లు చెబుతున్నారు. నౌకలో పేలుడు సంభవించినట్లు తెలిసింది. దీంతోనే నౌక ధ్వంసమైనట్లు సమాచారం. సిబ్బంది మాత్రం సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది. అయితే నౌకపై తామే దాడి చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించడంతో రష్యా మాత్రం దాన్ని ఖండిస్తోంది. నౌకలో ఎలాంటి దాడులు జరగలేదని చెబుతోంది.

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మంది దేశం విడిచి పారిపోయారు. రష్యా సేనలను ఉక్రెయిన్ కూడా ధీటుగానే ఎదుర్కొంటోంది. రష్యా తీసుకొచ్చిన యుద్ధ నౌకలను నాశనం చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ ముందుకు వెళ్తోంది. ఉక్రెయిన్ తీర ప్రాంతాలకు చేరుకున్న రష్యాకు చెందిన మాస్క్యా క్రూజ్ యుద్ధ నౌక చేరుకోగానే ఉక్రెయిన్ క్షిపణితో దాడికి పాల్పడినట్లు చెబుతోంది.

రష్యా దాడులకు ఉక్రెయిన్ కూడా గట్టిగానే సమాధానం చెబుతోంది. దాని వల్ల నష్టపోయినా ప్రతీకారం తీర్చుకునే క్రమంలో దాని శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయంగా వస్తున్న మద్దతును కూడగట్టుకుని తనదైన శైలిలో స్పందిస్తోంది. రష్యా ఇప్పటికే దాదాపు 20 వేల సైనికులతో పాటు భారీ స్థాయిలో యుద్ధ సామగ్రి ఆయుధాలను నష్టపోయింది. కానీ రష్యా మాత్రం దీనిని ఒప్పుకోవడం లేదు.

Scroll to Top