సూర్యుడు ఏర్పడే క్రమంలో జీవం పుట్టిందటా

BY T20,

విశ్వం ఎలా ఏర్పాటైంది. ఈ భూమి మీద జీవం ఎలా ఏర్పడిందన్న దానిపై ఇంకా అస్పష్టత నెలకొంది. కానీ దీనికి ఇపుడు సమాధానం దొరికేసిందని శాస్త్రవేతలు చెబుతున్నారు.

భూమ్మీద జీవం ఎలా ఏర్పడింది? మొదటి మూలాలు ఎక్కడ నుంచి వచ్చాయి? కోడి ముందా? గుడ్డి ముందా? అనేది శతాబ్దాలుగా మానవాళికి అంతుచిక్కని ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. సమస్త జీవరాశికి పునాదుల్లాంటి మూలకాల మూలల గుట్టు విప్పింది జపాన్, నాసా శాస్త్రవేత్తల బృందం. ఆ ప్రాథమిక పదార్థాలు విశ్వం నుంచే వచ్చాయనడానికి ఖచ్చితమైన ఆధారాలను ఈ బృందం సేకరించింది. కర్బనం పుష్కలంగా ఉన్న గ్రహశకలాల నుంచి ఉల్కల రూపంలో వచ్చి ఉండొచ్చని చివరకు సిద్ధాంతీకరించారు. జీవుల్లోని ఆర్ఎన్ఏ, డీఎన్ఐలకు ఇదే మూలమని తేల్చారు.

జీవుల్లో రైబో న్యూక్లిక్‌ యాసిడ్ (ఆర్‌ఎన్‌ఏ), డీఆక్సీరైబో న్యూక్లిక్‌ యాసిడ్ (డీఎన్‌ఏ)లో అడినిన్‌ (ఏ), గ్వానిన్‌ (జీ), సైటోసిన్‌ (సీ), థయామిన్‌ (టీ), యురాసిల్‌ (యు) న్యూక్లియోబేస్‌లు ఉంటాయి. డీఎన్‌ఏలో ఏండే ఏ, జీ, సీ, టీ.. ఆర్‌ఎన్‌ఏలో ఉండే ఏ, జీ, సీ, యు జతలు షుగర్లు, ఫాస్ఫేట్లతో కలిసి జన్యు సంకేతాన్ని ఏర్పరుస్తాయి. ఈ న్యూక్లియోబేస్‌ల తీరుతెన్నులను బట్టి వాటిని ప్యూరిన్‌ (అడినిన్‌, గ్వానిన్‌), పైరిమైడిన్‌ (సైటోసిన్‌, థయామిన్‌, యురాసిల్‌) అనే రెండు వర్గాలుగా విభజించారు. ఈ న్యూక్లియోబేస్‌లు మూలజతల్లా ఏర్పడుతూ నిచ్చెన ఆకృతిని తలపిస్తాయి.

జీవానికి పునాదులైన న్యూక్లియోబేస్‌లు విశ్వం నుంచి వచ్చాయా? తొలినాళ్లలో భూమిపై నెలకొన్న సంక్లిష్ట రసాయన పరిస్థితుల్లో అవి రూపొందాయా అన్నదానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అడినిన్‌, గ్వానిన్‌, యురాసిల్‌లు ఇప్పటికే ఉల్కల్లో ఉన్నట్టు గుర్తించారు. సైటోసిన్‌, థయామిన్‌ల ఆచూకీ ఇప్పటివరకూ తెలియదు. దీంతో ఈ అంశంపై అస్పష్టత నెలకొంది.

జపాన్‌లోని హక్కాయిడో యూనివర్సిటీకి చెందిన యాషుహిరో ఒబా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం.. ద్రవీకృత ఉల్క ధూళిలోని స్వల్ప పరిమాణంలో ఉండే భిన్న రసాయనాలను సేకరించే అధునాతన ప్రక్రియను అభివృద్ధి చేసింది. 'మర్చిసన్‌ ఉల్క' అనే గ్రహశకలం నమూనాపై ఈ విధానాన్ని ప్రయోగించినప్పుడు.. సైటోసిన్‌, థయామిన్‌లు ఆచూకీ గుర్తించారు. దీంతో జీవానికి అవసరమైన ఐదు ప్రాథమిక న్యూక్లియో బేస్‌లు ఉల్కల్లో ఉన్నట్టయ్యింది.

టాగిష్‌ లేక్‌, లేక్‌ ముర్రే అనే ఉల్కలపైనా అధ్యయనం చేశారు. ప్రతి గ్రహశకలం నమూనాలోనూ ఈ ఐదు న్యూక్లియోబేస్‌లు ఉన్నాయని తేల్చారు. అవి రూపొందే ప్రక్రియను వేగవంతం చేసే ఇమిడాజోల్‌ అనే మూలకాన్నీ గుర్తించారు. భూమిపై పడిన శకలాల నుంచి సేకరించిన నమూనాలు కాకుండా అంతరిక్షంలోని గ్రహశకలాల నుంచి నేరుగా నమూనాలను సేకరించి విశ్లేషిస్తే మరింత స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జపాన్‌కు చెందిన హయబుసా-2 స్పేస్‌క్రాఫ్ట్‌.. ర్యుగు అనే గ్రహశకలం నుంచి తెచ్చిన నమూనాల్లోని న్యూక్లియో బేస్‌లను విశ్లేషించడానికి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. మర్చిసన్‌ (ఆస్ట్రేలియా), టాగిష్‌ లేక్‌ (కెనడా), లేక్‌ ముర్రే (అమెరికా)లను శాస్త్రవేత్తలు పరిశోధించారు. సూర్యుడు ఏర్పడే క్రమంలో విశ్వంలో జరిగిన ఫొటోకెమికల్‌ చర్యల వల్ల న్యూక్లియోబేస్‌లు ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అనంతరం సౌర కుటుంబం పరిణామ క్రమంలో అవి గ్రహ శకలాల్లోకి చేరి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. తర్వాత కాలంలో ఈ ఖగోళ శిలలు ఉల్కల రూపంలో భూమిని ఢీ కొట్టాయని, వాటిద్వారా ఆ మూలకాలు మన గ్రహంపైకి చేరాయని చెబుతున్నారు. వాటి ద్వారా జీవం ఆవిర్భవించి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇదిలావుంటే ర్యుగు అనే గ్రహశకలం నమూనాల విశ్లేషించగా.. ప్రాచీనకాలం నాటి సేంద్రియ పదార్థం సమృద్ధిగా ఉందని వెల్లడయ్యింది. హయబుస మెషీన్ 2020లో తీసుకొచ్చిన ర్యుగు నమూనాలో భూమిపై ప్రోటీన్లు, జీవుల నిర్మాణలకు సహకరించే 10 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నట్టు గుర్తించారు.

Scroll to Top