టీడీపీ-జనసేన-బీజేపీ కలిస్తే గెలుపు గ్యారంటీ..? పవన్ కు కాపు సంక్షేమ నేత లేఖ

BY T20,

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి.

అధికా వైసీపీ (YCP) గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటూ ప్రజల్లో ఉంటోంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బాదుడే బాదుడు పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam)పై ఫోకస్ చేశారు.. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. కౌలు రైతులకు ఆర్థిక సాయం పేరుతో గ్రామాల పర్యటన చేస్తున్నారు. ఇలా కీలక పార్టీల నేతలంతా బిజిబీజీ అయ్యారు. ఇదే సమయంలో సీఎం జగన్ (CM Jagan) సైతం.. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి తన గ్రాఫ్ పెంచుకోవడంలో బాగంగా దావోస్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇలా ఎవరిని చూసినా అంతా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు.. ఇదే సమయంలో రాష్ట్రంలో పొత్తులపై తీవ్ర చర్చ జరుగుతోంది. టీడీపీ-జనసేన (TDP-Janasena) కలిసి పోటీ చేస్తే.. అధికారం గ్యారెంటీ ఆ రెండు పార్టీల అధినేతలు, ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విశ్లేషకులు.. వివిధ ప్రైవేటు సర్వేలు సైతం అదే మాట చెబుతున్నాయి. మరోవైపు అధికార వైసీపీ సైతం దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి అంటూ పదే పదే పిలుపు ఇవ్వడం కూడా.. కూటమిగా వెళ్తే బలం పెరిగినట్టే అనే సంకేతాలు అందేలా చేస్తోంది.

అయితే తాజాగా టీడీపీ..జనసేన..బీజేపీ కలిస్తే విజయం ఖాయమని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య అభిప్రాయపడ్డారు. కొద్ది రోజులుగా ఏపీలో ఎన్నికల పొత్తుల అంశం రాజకీయంగా హాట్ డిబేట్ గా మారింది. రెండు పార్టీల అధినేత మాటలే అందుకు కారణం అవుతున్నాయి. అయితే ఏ పార్టీ కూడా అధికారికంగా పొత్తులపై ప్రకటన చేయడం లేదు.. ఎవరికి వారు విడి విడిగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని మాత్రమే చెబుతున్నారు. దీంతో సీనియర్ పొలిటీషియన్ హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాసారు.

జనసేన పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలంటూ వైసీపీ నేతలు చేస్తున్నది కవ్వింపు చర్యలుగా ఆయన అభిప్రాయపడ్డారు. వాటి వెనుక భారీ కుట్ర దాగి ఉందని అభిప్రాయ పడ్డారు. సమయస్పూర్తిగా వ్యవహరించి ..ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉందని హరిరామ జోగయ్య లేఖలో స్పష్టం చేసారు. వైసీపీ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టటంతో పాటుగా..సొంత నిధులను వెచ్చించి.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవటం అభినందించదగ్గ విషయం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తే.. రైతుల సంక్షేమానికి ఏం చేస్తారో చెబితే బాగుంటుందంటూ జనసేనానికి జోగయ్య సూచించారు.

అలాగే అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగి..బ్యాంకు రుణాలు తీర్చలేని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్ తో పోరాటం చేస్తే బాగుంటందంటూ హరిరామ జోగయ్య జనసేన అధినేతకు రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. హరిరామ జోగయ్య తొలి నుంచి పవన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన అనేక అంశాల పైన పవన్ కళ్యాణ్ కు సూచనలు చేస్తూ వచ్చారు. మరో వైపు...పొత్తులకు ఇంకా సమయం ఉందని చెబుతూనే..ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ పదే పదే చెబుతున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే... భవిష్యత్ ఉండదంటూ పవన్ చెబుతున్నారు. టీడీపీ అధినేత సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీంతో..ఈ రెండు పార్టీల పొత్తు ఖాయమంటూ వైసీపీ నేతలు టార్గెట్ చేయటం ప్రారంభించారు. తాజాగా హరిరామ జోగయ్య ఈ రెండు పార్టీలతో పాటుగా బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మరి జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Scroll to Top