వెళ్లిపోండి.. లేదా చంపేస్తాం!.. కశ్మీరీ పండిట్లకు ఉగ్రసంస్థ బెదిరింపు

BY T20,

కశ్మీర్‌ పండిట్‌ రాహుల్‌ భట్‌ హత్య నేపథ్యంలో పండిట్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పండిట్ల ఆందోళనలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు.

ఇటువంటి సమయంలో వారిని మరింత భయపెట్టేలా, ఆందోళనకు గురిచేసేలా లష్కర్‌-ఇ-ఇస్లాం అనే ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడింది. 'జమ్ముకశ్మీర్‌ను వదిలిపోండి.. లేదా చంపేస్తాం' అని హెచ్చరిస్తూ పుల్వామా జిల్లాలోని హవాల్‌ మైగ్రెంట్‌ కాలనీ అధ్యక్షుడికి లేఖ రాసింది. 'వలసదారుల్లారా ఇక్కడి నుంచి వెళ్లిపోండి లేదా చావాల్సి వస్తుంది' అని హెచ్చరించింది. 'కశ్మీరీ ముస్లింలను చంపేందుకు కశ్మీర్‌లో మరొక ఇజ్రాయెల్‌ కావాలని కోరుకునే కశ్మీరీ పండిట్లకు ఇక్కడ ఉండేందుకు వీల్లేదు' అని పేర్కొన్నది. 'మీ భద్రతను రెట్టింపు, మూడింతలైనా చేసుకోండి.. చావు నుంచి తప్పించుకోలేరు' అని ఉగ్ర సంస్థ లేఖలో బెదిరించింది.

రాహుల్‌ హత్యపై సిట్‌ దర్యాప్తు
రాహుల్‌ భట్‌ హత్యను ఖండిస్తూ కశ్మీర్‌వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండటంతో కేసు దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసినట్టు జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రకటించారు. నిరసనకారులపై లాఠీ చార్జిపైన కూడా సిట్‌ దర్యాప్తు చేస్తుందన్నారు. ఇదిలా ఉండగా, పండిట్లు ఎవరూ కశ్మీర్‌ లోయను విడిచి వెళ్లవద్దని గుప్కార్‌ కూటమి కోరింది. రాహుల్‌ భట్‌ హత్య తీవ్రంగా బాధించినట్టు పేర్కొన్నది. 'ఈ దేశం మీది. మాది. మనందరిది. మీ ఇంటిని వదిలి వెళ్లవద్దు. రాహుల్‌ భట్‌ హత్య మీకెంత బాధ కలిగించిందో.. మాకు అంతే బాధగా ఉంది' అని కూటమి నేత తారిగామి అన్నారు.

Scroll to Top