అడవిలో ఆ చిట్టి తల్లి 36 గంటలు…!

BY T20,

చిత్తూరు జిల్లా కుప్పం మండలం నక్కల గుంట గ్రామానికి చెందిన మణి కవిత దంపతుల కుమార్తె జోషిక. ఈ చిన్నారి  వయసు కేవలం నాలుగేళ్లు. అయితే ఇంటి ముందు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంటి నుంచి దూరంగా వెళ్లి పోయింది. అయితే చుట్టూ చెట్లు పండ్లు పువ్వులు కనిపించడంతో మరింత లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆమె వెళ్ళింది ఏ పెరట్లోకో కాదండోయ్.. దట్టమైన అడవిలోకి. కాసేపు కాగానే ఆ చిన్నారి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఎలా వెళ్లాలి తెలియట్లేదు. చివరకు ఏం చేయాలో తెలియక ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది.

అయితే చాలా సేపు అవుతున్నా కూతురు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టు పక్కలంతా వెతికారు. అయినా ఎలాంటి ఆచూకీ లభింంచకపోవడంతో వెంటనే పోలీసులను అశ్రయించారు. చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి పర్యవేక్షణలో పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో పోలీసులు పాప ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు.

పాప ఆచూకీ కోసం రాత్రంతా గాలించారు. ఇంటికి సమీపంలోని కుంటల్లో ఉన్న నీటిని తోడించి వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు డాగ్ స్క్వాడ్ ను పిలిపించి.. పాప దుస్తులు చూపించారు. ఆ జాగిలం అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి ఆగడంతో.. పాప అక్కడే కనిపించింది.

అంబాపురం అటవీ ప్రాంతంలో పాప ఆచూకీని కనిపెట్టారి. చిన్నారి శరీరంపై చిన్న చిన్న గాయాలు ఉండటంతో వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే దాదాపు 36 గంటల పాటు ఆ చిన్నారి ఆ అడివిలోనే ఉండిపోయింది. భయంతో వెక్కి వెక్కి ఏడుస్తూ.. అలాగే పడుకుండిపోయింది. పాప ఒంటిరిగా 36 గంటలు గడపడం చాలా బాధను కల్గించిదంని పోలీసులు స్పష్టం చేశారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బతో చిన్నారి కాస్త అలసటగా ఉందని వివరించారు.

చికిత్స అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా తమ చెంతకు చేర్చిన కుప్పం పోలీసులకు ఎస్పీకి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. 36 గంటల వ్యవధిలోనే తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన కుప్పం అర్బన్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ ను ఎస్ ఐలు ఉమా మహేశ్వర్ శివ కుమార్ వారి సిబ్బంది ని కుప్పం ఎమ్మెల్సీ భరత్ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.

అయితే చుట్టు పక్కల అడవులు ఉన్నందున పిల్లలు ఎటు వెళ్తున్నారో తల్లిదండ్రులు కాస్త గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచించారు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే పిల్లల ప్రాణాలకే ముప్పని వివరించారు.

Scroll to Top