టైమ్ ట్రావెల్ సాధ్యమే

BY T20,

'ఆదిత్య 369' సినిమా చూశారా? టైమ్‌ మెషీన్‌లో హీరో, హీరోయిన్లు రాయలవారి కాలంతో పాటు భవిష్యత్తులోకి వెళ్లి వస్తారు. మూవీ కాబట్టి ఎన్నైనా ఊహించుకోవచ్చు. నిజజీవితంలో ఇలాంటివి ఆచరణ సాధ్యం కాదని అనుకోవచ్చు. అయితే, 'టైమ్‌ ట్రావెల్‌’ సాధ్యాసాధ్యాలపై ఐన్‌స్టీన్‌ నుంచి స్టీఫెన్‌ హాకింగ్‌ వరకు ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు. తాజాగా, టైమ్‌ ట్రావెల్‌ సాధ్యమేనని కెనడాలోని బ్రాక్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే, సమాంతర కాలక్రమంతో (ప్యారలల్‌ టైమ్‌లైన్స్‌) మాత్రమే దీన్ని ఆచరణలోకి తీసుకురావచ్చని వెల్లడించారు. ఎలా అర్థం చేసుకోవాలి? 'టైమ్‌ ట్రావెల్‌’ అనేది ఒక విస్తృతమైన కాన్సెప్ట్‌. దీన్ని అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణ చెప్పుకోవచ్చు. సుదూర విశ్వంలో ఏవైనా రెండు నక్షత్రాలు ఢీకొని పేలితే, ఆ పేలుడు కాంతి మన కండ్లకు చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే, ఇప్పుడు మనం అంతరిక్షంలో ఏదైనా పేలుడు కాంతిని చూస్తే… అది ఇప్పుడు కాకుండా ఎన్నో ఏండ్ల కింద పేలినట్లు లెక్క. అంటే గతించిన కాలంలో జరిగిన సంఘటనను ఇప్పుడు మనం వర్తమానంలో కండ్లారా చూస్తున్నా మన్నమాట. ఒకవేళ, అపసవ్య దిశలో (రివర్స్‌లో) కాంతి కంటే వేగంగా పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకొంటే భూమిపై వర్తమానం జరుగుతుండగానే.. పేలుడును ప్రత్యక్షంగా చూడగలం. ఇదే 'టైమ్‌ ట్రావెల్‌’ మూల సూత్రం. ఎలా సాధ్యం? ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం.. ద్రవ్యరాశి గల ఏ వస్తువూ కాంతికన్నా వేగంగా ప్రయాణించ లేదు. ఈ సృష్టిలో కాంతిదే అత్యధిక వేగం. కాంతి ప్రయాణం, ప్రవాహం వల్లే… కాలం కరిగిపోతు న్నట్టు భావిస్తారు. కాంతి ప్రయాణానికి సమానంగా మనమూ ప్రయాణిస్తే… అప్పుడు కాలవేగం స్థిరమవుతుంది. అంటే కాలంలో మార్పు ఉండదు. సాపేక్ష సిద్ధాంతాన్ని దాటుకొని కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తే, భూత, భవిష్యత్తు కాలాలకు చేరుకో వచ్చు. సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇంత వేగంతో మనిషి ప్రయాణిస్తే రక్తప్రసరణ, అవయవాల మధ్య సమన్వయం కోల్పోయి మరణిస్తాడు. అందుకే, విశ్వంలోని హానికర గామా కిరణాలను తట్టుకొంటూ.. గురుత్వాకర్షణ, వేగాన్ని స్థిరపరిచే ప్రత్యేక స్పేస్‌షిప్‌ను అభివృద్ధి చేస్తే 'టైమ్‌ ట్రావెల్‌’ సాధ్యమవ్వొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. నిన్నటి సూర్యోదయాన్ని మళ్లీ చూడాలంటే.. వేల ఏండ్ల కిందట భూమిపై జరిగిన ఘటనలు ఇప్పటికీ అంతరిక్షంలో కాంతి రూపంలో వెళ్తూనే ఉంటాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. వాటిని మనం కండ్లారా చూడాలంటే, కాంతికంటే వేగంగా ప్రయాణించాలి. శూన్యంలో ఆ సంఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో… అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే… అప్పుడు ఆ కాలంలోకి చేరుకోవచ్చు. మంగళవారం సూర్యోదయాన్ని కండ్లారా చూడాలంటే, 24 గంటలు వెనక్కి వెళ్లాలి. అంటే ఈ సమయంలో కాంతి ప్రయాణించిన 2,592 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని సెకను కంటే తక్కువ వ్యవధిలోనే అధిగమించాలి. అప్పుడే నిన్నటి సూర్యోదయాన్ని చూడగలం. గతాన్ని మార్చవచ్చా? గతంలోకి ప్రయాణించిన తర్వాత అక్కడి దృశ్యాలను మనం చూడగలమే తప్ప, వాటిలో ఎలాంటి మార్పు చేయలేమని పరిశోధకులు తెలిపారు. భూత, వర్తమాన కాలాలకు చెందిన ప్యార్‌లల్‌ లైన్స్‌ను ఆధారంగా చేసుకొని టైమ్‌ ట్రావెల్‌ను ఆచరణలో పెట్టొచ్చని బ్రాక్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. 'టైమ్‌ ట్రావెల్‌’ అంటే? కాలంలో ప్రయాణించడాన్ని స్థూలంగా 'టైమ్‌ ట్రావెల్‌’గా చెప్పొచ్చు. దీని సాయంతో గతవారం జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రేక్షకుల మధ్య స్టేడియంలో ఇప్పుడు కూర్చొని చూడొచ్చు. దీనికోసం కాలచక్రంలో 168 గంటలు వెనక్కి ప్రయాణించాల్సి ఉంటుంది.
Scroll to Top