Teenmar Mallanna: సీఎం కేసీఆర్‌ని ఒక్కమాట కూడా తిట్టను.. తీన్మార్ మల్లన్నలో అనూహ్య మార్పు

BY T20,

తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)..!

తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితమైన వ్యక్తి. జర్నలిస్ట్ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. నిత్యం సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే తీన్మార్ మల్లన్న.. గతంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లివచ్చారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను ఇప్పటికీ ఆయనపై ఎన్నో కేసులు ఉన్నాయి. అలాంటి తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సీఎం కేసీఆర్‌ను ఒక్క మాట కూడా తిట్టనని స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన 1200 మూవ్‌మెంట్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ''ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేయడం తమ విధానం కాదు. ఒట్టేసి చెబుతున్నా. ఇక నుంచి కేసీఆర్‌ను ఒక్క మాట కూడా తిట్టను. ప్రజా చైతన్యం కోసమే మా పోరాటం.'' అని పేర్కొన్నారు.

తన ఆస్తులన్నంటినీ ప్రభుత్వానికి రాసిచ్చి జూన్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. 7200 మూవ్మెంట్ (7200 Movement) ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడేదాకా పోరాటం చేస్తామని అన్నారు. ప్రజాసేవ చేయాలనుకునే వారు తమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాకే.. రాజకీయాల్లోకి రావాలన్నారు మల్లన్న. పెద్దోళ్ల బిడ్డలతో పాటే పేద పిల్లలు కూడా కలిసి చదవాలన్నది తమ లక్ష్యమని అన్నారు. విద్యావంతులైన బాల్క సుమన్, గాదరి కిషోలకు విద్యాశాఖను అప్పగిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అకాల వర్షాలొచ్చి రాష్ట్రమంతటా రైతులంతా ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు. వందల కోట్లు పెట్టిన అభివృద్ధి చేసిన యాదాద్రి క్షేత్రం.. ఒక్క గాలి వానకే తేలిపోయిందని దుయ్యబట్టారు.

మరోవైపు బీజేపీకి తీన్మార్ మల్లన్న షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి బీజేపీ ఆఫీసుకు వెళ్లబోనని స్పష్టంచేశారు. గత ఏడాది బీజేపీ (Telangana BJP)లో చేరిన ఆయన.. ఆరు నెలలు తిరక్కముందే కమలం శిబిరం నుంచి బయటికొచ్చేశారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో తన అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో మల్లన్న స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని పెడతానని ఆయన ప్రకటించారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దొంగల సంఖ్య 7200 అని, రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్న ఆ 7200 మంది వెలమ దొరల భరతం పడతానని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. అందుకోసమే 7200 మూవ్‌మెంట్‌ని చేపడుతున్నట్లు ప్రకటించారు. జూన్ 2 నుంచి తెలంగాణలో పాదయాత్ర చేపడతామని ఆయన పేర్కొన్నారు.

Scroll to Top