Vijaya Gadde: అసలు ఎవరీ విజయ గద్దె..? ఎలాన్ మస్క్ ఆమెనే ఎందుకు టార్గెట్ చేశారంటే..?

BY T20,

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ తను అనుకున్న పనులు చేయటం ప్రారంభించారు. ప్రత్యేకించి ఆయన కోరుకుంటున్న ఫ్రీ స్పీచ్‌కు ట్విట్టర్‌లో ఎవరైతే అడ్డు పడుతున్నారు అని భావిస్తున్నారో వాళ్లను టార్గెట్ చేయటం మొదలు పెట్టాడు ఎలాన్ మస్క్. అయితే మస్క్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళ ఇండియన్ కావటం, అందులోనూ తెలుగు మహిళ కావటం ప్రత్యేకంగా చెప్పకోవాల్సిన విషయం.

విజయ గద్దె.

ఈపేరు ఇప్పుడు తెరమీదకు వచ్చినట్లు కనిపిస్తుంది కానీ రెండేళ్ల క్రితం అంటే 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ పేరు సెన్సేషనల్‌గా మారింది. కారణం ఏంటంటే ప్రజలను తప్పుదోవ పట్టించేలా కామెంట్లు చేస్తున్నారని నాటి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ ను సస్పెండ్ చేయంటలో ట్విట్టర్ లీగల్ హెడ్ గా విజయ గద్దే దే కీ రోల్ అంటారు. వాస్తవానికి ట్విట్టర్ లో సీఈవో పదవికంటే ఎక్కువ పవర్ ఈ లీగల్ హెడ్ కి ఉందనటంలో ఎలాంటి సందేహం లేదంటారు. ట్విట్టర్ విధాన నిర్ణయాల్లో ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్న విజయ.. తప్పుడు ప్రచారాన్ని అరికట్టడంలో ట్విట్టర్ ను యూజర్ ఫ్రీగా మార్చటంలో చాలా కొత్త పాలసీలు తయారు చేశారు. 2014 నుంచి ట్విట్టర్ కు చీఫ్ లీగల్ ఆఫీసర్ గా ఆమె సేవలందిస్తున్నారు. అప్పటి CEO జాక్ డోర్స్ తో కలిసి ట్విట్టర్ లో కీలక మార్పులు చేపట్టారు.

టెక్సాస్ లో టాప్ లాయర్ అయిన 48 ఏళ్ల విజయ.. ధైర్యంతో తీసుకున్న అనేక నిర్ణయాలు ట్విట్టర్‌లోని, అమెరికాలోని కన్జర్వేటివ్స్ కు ఇబ్బందికరంగా మారాయి. అందుకే ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా లెఫ్ట్ వింగ్ అంటూ నేరుగా విజయ ఫోటోతో ట్వీట్లు చేశారు. మరో విషయం ఏంటంటే ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ ఓన్ చేసుకున్నప్పుడు బోర్డ్ మీటింగ్ లో ఎమోషనల్ అయ్యారంట విజయ. మస్క్ లాంటి దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తుల చేతుల్లోకి ట్విట్టర్ వెళ్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అని భయపడ్డారంట. ఫ్రీ స్పీచ్ పేరుతో ట్విట్టర్ లో సంస్కరణలు చేపడుతున్నాంటున్న ఎలాన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ ను ఉంచుతారో లేదో సందేహాలు నెలకొన్న టైంలోనే.. ట్విట్టర్ సెన్సార్ షిప్ బాధ్యతలు చూస్తున్న గద్దె విజయపై నేరుగా ఇలా దాడికి దిగటం చాలా మందికి నచ్చలేదు.

సాగర్ ఎంజేటీ అనే మరో తెలుగు సంతతి వ్యక్తి అమెరికాలో క్రిస్టల్ అండ్ సాగర్ అనే పోడ్ కాస్ట్ లో బ్రేకింగ్ పాయింట్స్ అనే బులిటెన్ ను నిర్వహిస్తున్నారు. ఆయన కూడా గద్దె విజయపై ఎలాన్ మస్క్ ఇలా నేరుగా దాడికి దిగటం ఏంటంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీటికి మస్క్ రిప్లై ఇచ్చాడు కూడా. గతంలో ఓ టాప్ న్యూస్ ఛానెల్ పై ట్విట్టర్ సెన్సార్ షిఫ్ ను ఉపయోగించటం ట్విట్టర్ అకౌంట్ ను సస్పెండ్ చేయటం సరైన చర్య కాదు కదా అంటూ మస్క్ సాగర్ కు ట్విట్టర్ లో సమాధానం ఇచ్చారు. చాలా మంది మస్క్ చర్యలను ఖండిస్తూ విజయకు, సాగర్ కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.

2018లో జాక్‌ డార్సీ బృందం సభ్యురాలిగా విజయ ఢిల్లీ కూడా వచ్చారు. అప్పుడు ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. విజయకు మూడేళ్ల వయస్సున్నప్పుడే వాళ్ల కుటుంబం టెక్సాస్ కు వెళ్లి సెటిల్ అయిపోయింది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే టెక్సాస్ లో విజయ తల్లిదండ్రులు స్థిరపడ్డారు. అమెరికా వెళ్లిన తొలినాళ్లలో విజయ తండ్రి జాత్యాంహకారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన అనుభవాలను తెలుసుకున్న విజయ 'లా' చదివారు. శ్వేత జాతీయుడైన అమెరికన్‌ రామ్సే హామ్సనీని వివాహం చేసుకున్నారు. ఆమె భర్త కూడా లాయరే. ఇప్పుడు ఎలాన్ మస్క్ చేసిన కామెంట్స్ కూడా ఆయన శ్వేత జాతి అహంకారం బయటపెడుతున్నాయంటూ విజయ సపోర్టర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వివాదంతో ఎలాన్ మస్క్ తో పాటు విజయ, సాగర్ అనే తెలుగుపేర్లు కూడా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి.

Scroll to Top