BY T20,
మోకాళ్లపై కూర్చొని అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన నటుడు.
'నా జీవితంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆమె మా అమ్మ. అమ్మా.. నీ కుమారుడికి ఏం కాదు. ఎవ్వరేం చెయ్యలేరు' అంటూ ఉద్వేగానికి లోనయ్యారు నటుడు విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించిన 'అశోకవనంలో అర్జునకల్యాణం' మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఓ రహదారిపై ఆయన ప్రాంక్ వీడియోను చేసిన సంగతి తెలిసిందే. ప్రమోషన్ పేరిట న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఓ టీవీ ఛానల్ డిబెట్ నిర్వహించడం.. ఎలాంటి సమాచారం లేకుండా ఆ డిబెట్లో విశ్వక్ పాల్గొని అసభ్య పదజాలం ఉపయోగించడం.. అనంతరం ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పడం.. ఇలా వరుస ఘటనలతో గత రెండు రోజుల నుంచి విశ్వక్ పేరు మార్మొగిపోతుంది. ఈనేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఖమ్మంలో జరిగిన 'అశోకవనంలో అర్జునకల్యాణం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ మాట్లాడాడు.
''అశోకవనంలో అర్జునకల్యాణం'లో అన్నిరకాల భావోద్వేగాలు చక్కగా పండాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అర్జున్కుమార్కి మనలానే భయం, అభద్రతా భావం ఎక్కువ. 33 ఏళ్లపాటు ఎన్నో భయాలు, అభద్రతాభావాలు చూసి.. చివరికి వాటిన్నింటినీ దాటుకుని ఏం చేశాడన్నదే మా సినిమా. దయచేసి మా చిత్రాన్ని మే 6న దగ్గర్లోని థియేటర్లలో వీక్షించండి. ఇప్పటివరకూ నేను చేసింది కేవలం నాలుగు సినిమాలే. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నా. వాటి గురించి ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పాలనుకుంటున్నా. హీరో అవుతా.. సినిమా ఇండస్ట్రీలోకి వెళతా.. అని చెప్పినప్పుడు అందరిలానే మా కుటుంబం కూడా షాకయ్యింది. కానీ, మా అమ్మ మాత్రం మొదటి నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఎంతో కష్టపడి.. డ్యాన్స్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగి.. రూ.12 లక్షలు పెట్టి 'వెళ్లిపోమాకే' తీస్తే.. ఓ నిర్మాత మా చిత్రాన్ని కొనుగోలు చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆరోజు బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్నా అనిపించింది. కెరీర్ ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి. సమస్యలెదురైనప్పుడు కూడా చిరునవ్వుతో కనిపించడమే ఎదుగుదలంటే. నన్ను ఎవరో ఏదో అన్నారని, నాకెదో జరుగుతుందని నేనెప్పుడూ బాధపడలేదు. ఇప్పటికే ఇలాంటివి ఎన్నో చూశా. ఇవి నాకేం కొత్త కాదు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చా. వరుస ఘటనల తర్వాత తాజాగా సోషల్‌మీడియాలో #Vishwaksen పేరుతో నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మెస్సేజ్‌లు చూసి.. నేను సంపాదించిన ఆస్తి ఇది. కానీ నాకు ధైర్యాన్ని ఇచ్చింది మీరే'' అంటూ విశ్వక్ ఉద్వేగానికి లోనయ్యారు.